Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెన్సిల్‌ మొనపై 'చిన్న' గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

పెన్సిల్‌ మొనపై 'చిన్న' గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి అంటేనే భారీ విగ్రహాలు, ఆకట్టుకునే మండపాలు, రంగురంగుల అలంకరణలు దర్శనమిస్తుంటాయి. అయితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ కళాకారుడు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కేవలం 6 మిల్లీమీటర్లలో గణేశుడి విగ్రహాన్ని పెన్సిల్‌ మొనపై చెక్కి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

పటేల్‌ మయాంక్‌ దినేశ్‌భాయ్‌ అనే కళాకారుడు ఈ సూక్ష్మ గణనాథుడి విగ్రహాన్ని రూపొందించాడు. సూరత్‌లోనే ఇది అతి సూక్ష్మ గణపయ్య విగ్రహమని ఆయన చెబుతున్నారు. పెన్సిల్‌ మొనపై ఇంత చిన్న పరిమాణంలో గణనాథుణ్ని తీర్చిదిద్దడం ఆయన సూక్ష్మ కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

చిట్టి గణేశుడి రూపొందించాలనే ఈ ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చిందని మయాంక్ తెలిపారు. ఒకప్పుడు సరదాగా పెన్సిల్‌ మొనపై తన పేరులోని అక్షరాలను చెక్కడం నేర్చుకున్నట్టు చెబుతున్న ఆయన.. వినాయకుడి విగ్రహాన్నీ చెక్కాలనే ఆలోచన తట్టిందన్నారు. ఆ ఆలోచనకు రూపమిచ్చేందుకు ఏకంగా ఆరేళ్ల సమయం పట్టిందని, ఆ తర్వాత ఇలా 6 మి.మీ. గణనాథుడి విగ్రహం రూపుదిద్దుకుందని చెప్పుకొచ్చారు. 'ఇంత చిన్నగా విగ్రహాన్ని చెక్కడం అంత సులువు కాదు. ఇందుకోసం ఎంతో ఏకాగ్రతతో 5 రోజులపాటు శ్రమించాలి. ఆ సమయంలో ఏమాత్రం కదిలినా శ్రమంతా వృథా అవుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి' అని మయాంక్ వివరించారు.

ఈ సూక్ష్మ విగ్రహాన్ని ఓ కళాఖండంగా ప్రదర్శించడమే కాకుండా.. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు మయాంక్. తర్వాత ఆ పెన్సిల్‌ను పూర్తిగా నిమజ్జనం చేయనున్నట్టు తెలిపారు. భారీ విగ్రహాలతో సందడి చేసే గణేశ్ చతుర్థి వేడుకల్లో.. 6 మి.మీ. చిట్టి గణపయ్య ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy