విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) తర్లువాడలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రతినిధులు, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ డేటా సెంటర్‌కు తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలో 600 ఎకరాలను ఏపీ సర్కార్ కేటాయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి లోకేశ్ మాట్లాడారు.
మాది గూగుల్.. వైసీపీది గొడ్డలి..
VIZAGలో G అంటే గూగుల్ అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క అని చెప్పుకొచ్చారు. ఇవాళ్టి నుంచి విశాఖ ముఖచిత్రం మారబోతోందని తెలిపారు. సరికొత్త చరిత్రకు ఇవాళ పునాదిగా మారిందని వెల్లడించారు. ఇకపై డేటా ఏఐ హబ్‌గా విశాఖపట్నం మారుతోందని వివరించారు. పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని ఐదేళ్లు ఏపీలో విధ్వంస పాలన చూశామని విమర్శించారు. గూగుల్ ప్రాజెక్టు తెచ్చిందెవరని గూగుల్‌ని అడిగితే చంద్రబాబు పేరే చెబుతోందని అన్నారు. వైసీపీ పాలనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని ఆరోపించారు. తమది గూగుల్.. వైసీపీది గొడ్డలి.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పుకొచ్చారు. నమో అంటే నాయుడు.. మోదీ అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు.

