Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎన్బీలో కరెన్సీ చెస్ట్‌లో నకలీ నోట్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్

పీఎన్బీలో కరెన్సీ చెస్ట్‌లో నకలీ నోట్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కరెన్సీ చెస్ట్‌లో భారీగా నకిలీ నోట్లు బయటపడ్డాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ సహారన్‌పూర్‌లోని పీఎన్‌బీ కరెన్సీ చెస్ట్‌లో సుమారు రూ.7.40 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నట్లు ఆడిట్‌లో తేలినట్టు తెలుస్తోంది. బ్యాంకు భద్రతా వ్యవస్థను దాటి నకిలీ నోట్లు కరెన్సీ చెస్ట్‌లోకి ఎలా వచ్చాయనే విషయం కలకలం రేపుతోంది.

కరెన్సీ చెస్ట్‌లో భద్రపరిచిన అసలు నోట్లను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ చెస్ట్‌ నుంచి బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి పంపిన సొమ్ములో సుమారు రూ.4.30 లక్షల వ్యత్యాసం కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పీఎన్‌బీ నోడల్‌ అధికారి విచారణ ప్రారంభించారు. ఈ మేరకు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ సహా ఇద్దరు కరెన్సీ చెస్ట్‌ మేనేజర్లను బ్యాంక్ యాజమాన్యం సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. అయితే.. ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయి? అసలు నోట్ల స్థానంలో వాటిని ఎవరు ఉంచారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు.

మరోవైపు.. కరెన్సీ చెస్ట్‌లోని నోట్ల కట్టల నుంచి అక్కడి స్వీపర్ నగదు తీస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో సదరు నోడల్‌ అధికారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బ్యాంకు అధికారులతో పాటు స్వీపర్‌పై కేసు నమోదైనట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా కరెన్సీ చెస్ట్‌లోని నగదు లెక్కలు, రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, నగదు తరలింపు వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy