ఇంటర్నెట్ డెస్క్: నార్వే ఛెస్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారతీయ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందపై ఛెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ ప్రశంసల వర్షం కురిపించారు.
అతడు ఒక అద్భుతమైన ఫైటర్ అని కొనియాడారు. నార్వే ఛెస్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
'అతడు గత నాలుగు క్లాసిక్ గేమ్స్‌లో విజేతగా నిలిచాడు. ఇది మామూలు విషయం కాదు. ప్రాగ్ (ప్రజ్ఞానంద) గొప్ప ఫైటర్. అతడి టాలెంట్‌కు తగిన విజయం దక్కడం చూస్తుంటే సంతోషంగా ఉంది' అని మాగ్నస్ కార్ల్‌సన్ అన్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానందతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ కార్ల్‌సన్ ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే, ఈ టోర్నీ చివరి మ్యాచ్‌ను ప్రజ్ఞానంద ముగించిన తీరు మాత్రం అద్భుతమని ప్రశ్నించారు.
కాస్త బలహీన స్థితిలో టోర్నీని మొదలుపెట్టినప్పటికీ విజేతగా నిలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రజ్ఞానంద కూడా అన్నారు. 'కార్ల్‌సన్‌పై గెలుపు సంతోషాన్ని ఇచ్చింది. టోర్నీ గెలవాలంటే ప్రతి పాయింటు ముఖ్యమే. అయితే, మొదట్లో కాస్త తడబడ్డా చివరకు గెలుపుతో టోర్నీని ముగించడం.. అది కూడా కార్ల్‌సన్ సమక్షంలో విజేతగా నిలవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది' అని ప్రజ్ఞానంద అన్నారు.

