Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

మరావతి, జులై 29: ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. బుధవారం గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి నెలకున్న మానవ - ఏనుగు సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. ఆధునిక సాంకేతికతతో మన్యంలో అటవీ ఏనుగుల సమస్యకు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఇది రైతుల పంటలు, ప్రజల ప్రాణాల రక్షణకు కీలక ముందడుగు అని అభివర్ణించారు.

అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి పంటలు ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా ఈ ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నప్పుడు స్థానిక ప్రజలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యతగా భావించి.. గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేశామని వివరించారు.

ఉత్తరాంధ్రలో మానవ - ఏనుగు సంఘర్షణల నివారణలో ఈ కేంద్రం ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఏపీ డిప్యూటీ సీఎం తెలిపారు. మనుషులు, ఏనుగులు మధ్య సామరస్య జీవనానికి వేదికగా ఈ గుచ్చిమి ఏనుగుల క్యాంప్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నానని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.

మన విజ్ఞప్తిని గౌరవించి, ఎంతో ఆప్యాయతతో నాలుగు కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించడం వారి గొప్ప మనసు, స్నేహభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏనుగులను ఇవ్వడం అనేది సంపద ఇచ్చినట్లుగా అక్కడ ప్రజలు భావిస్తారని వివరించారు. అయినా తెలుగు ప్రజల రక్షణ కోసం ప్రేమతో కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించిన కర్ణాటక ప్రభుత్వంతోపాటు ఆ రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కె.అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేట్ జోక్యంపై హైకోర్టులో పిల్.. విచారణ వాయిదా

చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy