Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచ పాల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా.?

ప్రపంచ పాల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా.?

ఇంటర్నెట్ డెస్క్: పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, మెగ్నీషియం, జింక్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

ఇవి శరీర ఎదుగుదల, ఎముకల బలం, కండరాల ఆరోగ్యం, మొత్తం శారీరక శ్రేయస్సుకు తోడ్పడతాయి. పాల ప్రాముఖ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, పాడి పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రపంచ పాల దినోత్సవం చరిత్ర

ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని తెలియజేయడం కోసం 2001లో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 1న ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. పాల వినియోగం, పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతుల పాత్ర వంటి అంశాలపై ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రపంచ పాల దినోత్సవం ఉద్దేశమిదే..

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం పాల పోషక విలువల గురించి ప్రజలకు తెలియజేయడం. అలాగే పాడి పరిశ్రమ స్థానిక ఆర్థిక వ్యవస్థలకు, రైతుల జీవనోపాధికి, ఆహార భద్రతకు అందించే మద్దతును గుర్తించడం కూడా దీని లక్ష్యం. పాల ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంపొందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకొంటారు.

రోజూ ఒక గ్లాసు పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది

గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో తరచుగా తినాలనే కోరిక తగ్గి, అతిగా తినడాన్ని నివారించవచ్చు.

మంచి నిద్రకు సహాయపడతాయి

పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు.

ఎముకలను దృఢంగా ఉంచుతాయి

పాలలో సమృద్ధిగా ఉండే కాల్షియం ఎముకల బలానికి అవసరం. క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి, ఎముకలు మరింత బలపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ

రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు కొంతమేర సహాయపడవచ్చు.

ఒత్తిడి తగ్గించడం

పాలలో నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే కొన్ని సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, శరీరానికి విశ్రాంతిని అందిస్తాయి.

ఉత్సాహంగా ఉండేందుకు

రాత్రి పాలు తాగడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. దీంతో మరుసటి రోజు ఉదయం మరింత ఉత్సాహంగా, తాజాగా అనిపిస్తుంది.

పాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అనేక పోషకాల నిలయం. ఆరోగ్యకరమైన జీవనశైలిలో పాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పాల ప్రాముఖ్యాన్ని గుర్తుచేస్తూ, పాడి పరిశ్రమకు మద్దతు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇవీ చదవండి:

రోజూ 1 కిలోమీటరు నడిస్తే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ప్రతి 10 మందిలో ఏడుగురికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy