Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి 10 మందిలో ఏడుగురికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్

ప్రతి 10 మందిలో ఏడుగురికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు దాదాపు 70 శాతం మంది తగినంత ఫైబర్ (పీచుపదార్థం) తీసుకోవడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. అంటే ప్రతి 10 మందిలో సుమారు 7 మంది రోజుకు తీసుకోవాల్సిన ఫైబర్ పరిమాణాన్ని పొందడం లేదు.

సోషల్ మీడియాలో ఆరోగ్య ట్రెండ్‌లు ఎక్కువగా వస్తున్నప్పటికీ, చాలా మంది ఇంకా రోజువారీ అవసరమైన ఫైబర్‌ను సరిగ్గా తీసుకోవడం లేదని ఈ పరిశోధన తెలిపింది.

తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?

ఆశీర్వాద్ హ్యాపీ టమ్మీ విడుదల చేసిన డేటా ప్రకారం, 2021 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా 6.5 లక్షల మందికి పైగా ఇచ్చిన సమాధానాల ఆధారంగా 70 శాతం మంది రోజువారీ అవసరమైన ఫైబర్‌ను తీసుకోవడం లేదని తేలింది. శారీరక వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ ఒత్తిడి, తక్కువ నీరు తాగడం, సరైన నిద్ర లేకపోవడం వంటి జీవనశైలి కారణాలు కూడా దీనికి కారణమని పరిశోధన చెబుతోంది.

మహిళల్లో సమస్య ఎక్కువ

సర్వే ప్రకారం మహిళల్లో ఫైబర్ లోపం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పురుషుల్లో సుమారు 63 శాతం మంది తగినంత ఫైబర్ తీసుకోకపోతే, మహిళల్లో ఈ సంఖ్య 73 శాతం కంటే ఎక్కువగా ఉంది. ICMR-NIN సూచనల ప్రకారం, వయోజన మహిళలు రోజుకు కనీసం 25 గ్రాములు, పురుషులు 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ వ్యవస్థకు చాలా అవసరం. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఆహార అలవాట్లలో లోపం

పరిశోధన ప్రకారం చాలా మంది రోజువారీ ఆహారంలో వైవిధ్యం చూపడం లేదు. ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే రోజూ పలు రకాలు ధాన్యాలు తింటున్నారు. సుమారు 40 శాతం మంది పండ్లు చాలా తక్కువగా తింటున్నారు. కూరగాయలు తినే అలవాటు ఉన్నా, మొత్తం ఆహారంలో వైవిధ్యం తక్కువగా ఉంది.

జీవనశైలి ప్రభావం

సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది రోజూ శారీరక వ్యాయామం చేయడం లేదని తెలిపారు. 30 శాతం మంది మాత్రమే సరిపడా నీరు తాగుతున్నారని చెప్పారు. దాదాపు సగం మందికి నిద్ర సరిగ్గా రావడం లేదని.. ఇంకా ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అన్ని కారణాలు కలిసి జీర్ణ వ్యవస్థ, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల సూచన

ఫైబర్ తీసుకోవడం, జీర్ణ ఆరోగ్యంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం మెరుగవుతుందని వారు సూచిస్తున్నారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఎబోలా వైరస్‌.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

30 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తోంది?

For More Latest News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy