Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని తెలిపారు. తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా తాము ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా తాము అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశాం..

రాష్ట్రంలో 2.36కోట్ల టన్నుల పంట దిగుబడులు రావడం తమకు గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు అప్పు భారాన్ని తగ్గించేందుకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు సంక్షేమానికి రూ.1.56లక్షల కోట్లు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ.82వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రైతుల నుంచి 10వేల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

సాగునీటి పరిస్థితి మారలేదు..

జొన్న కొనుగోలుకు రూ.1,154కోట్లు చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు తిరిగి ప్రాణం పోస్తామని చెప్పారు. తుమ్మడిహెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు దేశానికి ఆదర్శంగా మారారని తెలిపారు. ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ.లక్ష కోట్ల రుణాలిస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.60వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశామని వెల్లడించారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా 67వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఈనెలలోనే టీజీపీఎస్సీ ద్వారా మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy