ముంబై, సెప్టెంబర్ 20: ఇండోర్‌లో తాజాగా జరిగిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన (మిమిక్రీ) వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ స్టాండ్-అప్ కమెడియన్‌గా మారితే మంచి ఉపాధి లభిస్తుందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఆయన ఓ నిరుద్యోగిగా మార్చేశారని ఎద్దేవా చేశారు.
ముంబైలో ఇవాళ(ఆదివారం) మీడియాతో మాట్లాడిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. 'రాహుల్ గాంధీకి ఇప్పుడు మిగిలిన ఏకైక పని ఇదే. ఆయన స్టాండ్-అప్ కమెడియన్ అవతారం ఎత్తి మిమిక్రీ చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. పొలిటికల్ పార్టీని ఎలాగూ నిరుద్యోగిగా మార్చేశారు' అని వ్యాఖ్యానించారు.
బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారావోగి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, చేష్టలు ఆయన రాజకీయ అపరిపక్వతను, స్థాయి దిగజార్చే ప్రవర్తనను తెలియజేస్తున్నాయని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత స్థానంలో ఉండి ప్రధాని మాతృమూర్తిని అవమానించేలా ప్రవర్తించడం సభ్యసమాజం అంగీకరించదని పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ.. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. అది కేవలం ఒక సాధారణ 'మిమిక్రీ' మాత్రమేనని, అందులో అభ్యంతరకరమైనది ఏమీ లేదని స్పష్టం చేశారు. సభలోని మహిళలు, ప్రజలు నవ్వుకున్నారని, నిజమైన అవమానం అంటే గతంలో సోనియా గాంధీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలేనని ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ఇండోర్ ఈవెంట్‌లో రాహుల్ గాంధీ, కమెడియన్ పుల్కిత్ మణితో కలిసి చేసిన వ్యాఖ్యలు/చేష్టలు ప్రధానిని, ఆయన తల్లిని ఉద్దేశించి గేలి చేసేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించడంతో ఈ రాజకీయ వివాదం రాజుకుంది.

