Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురి మృతి, 152 మందికి గాయాలు..

రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురి మృతి, 152 మందికి గాయాలు..

మాస్కో: రష్యాలోని తూర్పు అముర్ ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. అముర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ (AGCC)లో భారీ పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు మృతిచెందగా..

మరో 152 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలైన 36 మందిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 9 మంది ఆచూకీ గల్లంతైంది. మృతుల్లో ఆరుగురు చైనా జాతీయులు ఉన్నట్లు ఏజీసీసీ యాజమాన్యం తెలిపింది.

ఏజీసీసీ ప్లాంట్ ప్రారంభానికి ముందు ప్రీ-కమిషనింగ్ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, రష్యాలోని స్వోబోడ్నీ సమీపంలో అముర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌ను రష్యా, చైనా దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు. రష్యన్ పెట్రోకెమికల్ కంపెనీ సిబూర్, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు, గ్యాస్ దిగ్గజం సినోపెక్ దీనిని నిర్మించాయి.

పాలిథిలీన్, పాలీప్రొపిలీన్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమగా దీనిని రూపొందించారు. ప్రతి రోజు నిర్మాణ పనుల్లో సుమారు 30,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కాంప్లెక్స్ సమీపంలోని అమూర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ (అమూర్ GPP) నుంచి ముడి పదార్థాలను సేకరించి వాటిని ప్లాస్టిక్ తయారీ పదార్థాలుగా మార్చేందుకు ఏజీసీసీని తీర్చిదిద్దారు. పరిశ్రమ పూర్తి కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రతి ఏటా సుమారు 2.3 మిలియన్ టన్నుల పాలిథిలీన్, నాలుగు లక్షల టన్నుల పాలీప్రొపిలీన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy