Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌పై లవ్లీనా అభ్యంతరం.. ఆమె చర్యను ప్రశంసించిన మోదీ

రెస్టారెంట్‌లో భారత మ్యాప్‌పై లవ్లీనా అభ్యంతరం.. ఆమె చర్యను ప్రశంసించిన మోదీ

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 సందర్భంగా భారత మ్యాప్‌ను తప్పుగా ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్‌లో జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమించిన లవ్లీనా.. వెంటనే సిబ్బందికి చెప్పి సరి చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రస్తావించిన మోదీ.. దేశం పట్ల ఆమెకున్న గౌరవాన్ని అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లవ్లీనాను ఉద్దేశించి మోదీ సరదాగా.. 'ఏమైంది? రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడుతున్నారట?' అని అడిగారు. దీనికి ఆమె నవ్వుతూ.. 'సర్‌.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో మేం చాలా బాగా ఆడాం. చివరి రోజు కావడంతో అందరం సంతోషంగా వేడుక చేసుకుంటున్నాం. అక్కడ జాతీయ పతాకాన్ని తప్పుగా ముద్రించి అక్కడ పెట్టారు. అది నాకు నచ్చలేదు. అందుకే రెస్టారెంట్ సిబ్బందికి మర్యాదగా చెప్పాను. వాళ్లు కూడా వెంటనే దాన్ని సరిచేశారు' అని వివరించింది. కాగా లవ్లీనా చర్యను మోదీ అభినందించారు. 'గేమ్స్‌ పూర్తయ్యాయి. మీరు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న సమయంలో కూడా ఆ మ్యాప్‌ ప్రాముఖ్యాన్ని గుర్తించడం గొప్ప విషయం. గెలుపు సంబరాల్లోనూ దేశ ప్రతిష్ఠను గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేయడం సామాన్యమైన విషయం కాదు. చాలా కాలం పాటు ప్రజలు దాన్ని గుర్తుంచుకుంటారు' అని ప్రశంసించారు.

మీరాబాయి కన్నీళ్ల వెనుక..

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. బంగారు పతకం అందుకున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడంపై మోదీ ఆరా తీశారు. అంతేకాదు.. ఆమెకు స్వయంగా లడ్డూ తినిపించడం విశేషం. 'కన్నీళ్లు ఎందుకొచ్చాయి?' అని మోదీ ప్రశ్నించారు. 'ఆ క్షణంలో చాలా సంతోషంగా, భావోద్వేగంగా అనిపించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో కేవలం కిలో తేడాతో పతకం కోల్పోయాను. ఆ తర్వాత నాలుగేళ్లలో గాయాలతో పాటు కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నాను. ఆ నాలుగేళ్లు నాకు చాలా కఠినంగా గడిచాయి. గ్లాస్గోలో పతక వేదికపై నిలబడి.. మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ.. జాతీయ గీతం వినిపించినప్పుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాను' అని మీరాబాయి వివరించింది.

'నరేంద్ర' పేరంటేనే అసహ్యమేసింది!

బాక్సర్‌ నరేంద్ర బెర్వాల్‌ మాత్రం మోదీతో సరదా విషయాన్ని పంచుకున్నాడు. 2015 మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌లో ఓ పాకిస్థాన్‌ బాక్సర్‌తో తలపడి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'ఆ మ్యాచ్‌ తర్వాత ఇద్దరం వైద్య గదిలో చికిత్స తీసుకుంటున్నాం. అప్పుడు అతడు.. 'భాయిజాన్‌.. నీ పేరు నరేంద్ర, నీ కోచ్‌ పేరు నరేంద్ర, మీ ప్రధాని పేరు కూడా నరేంద్ర. నాకు నరేంద్ర పేరంటేనే అసహ్యం వచ్చేసింది' అని అన్నాడు' అని బెర్వాల్‌ చెప్పడంతో మోదీ నవ్వుకున్నారు.

strong>

జట్టు నుంచి పిలుపు రాకపోయినా ప్రయత్నాలు ఆపొద్దు.. షమీకి జహీర్ ఖాన్ సూచన

బుమ్రా కాదు.. ఆ స్టార్ ప్లేయర్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy