ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశం
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్ మరణాల కేసుల్లో మృతుల వివరాల నమోదు ప్రక్రియ 21 రోజుల్లో జరగాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు హెల్త్ సెక్రటరీ వీరపాండియన్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర మెడికో-లీగల్ కేసుల్లో సంభవించే మరణాలకు సంబంధించిన వివరాలను.. సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్లకు సకాలంలో చేరడం లేదని తెలిపారు. ఇకపై అలా జరగరాదని స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ మరణాల వివరాలను నిర్ణీత విధానంలో సకాలంలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి గతంలో ఆయన లేఖ రాశారు. దీనికి అనుగుణంగా డీపీజీ కార్యాలయం ఈ నెల 25న రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీలకు సర్క్యులర్ జారీ చేసింది. మరణాల వివరాలను చట్టం, నిబంధనల ప్రకారం నిర్ణీత ఫారం-11లో నమోదు చేసి, సంబంధిత రిజిస్ట్రార్లకు నివేదించాలని పోలీసు అధికారులకు సూచించింది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన సర్క్యులర్‌తో పాటు ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని వీరపాండియన్ ఆదేశించారు.

