భువనేశ్వర్, జూన్ 7: రూ.6,000 నెల జీతంతో సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఓ ఇంజినీర్.. అవినీతికి పాల్పడి వందల రెట్లు అక్రమాస్తులు కూడబెట్టాడు.
ఒడిశా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(Odisha Vigilance Department) జరిపిన దాడుల్లో ఆ ఇంజినీర్ ఇల్లీగల్ సామ్రాజ్యం గుట్టు రట్టయింది. బ్యాంకు లాకర్లలో దాచిపెట్టిన రూ.2 కోట్ల అక్రమ నగదుతోపాటు భారీగా స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఒడిశాలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద యాంటీ కరప్షన్ ఆపరేషన్లలో ఒకటిగా ఇది నిలిచింది.
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో అవినీతి నిఘా నీడలోకి వచ్చిన ఈ అధికారి పేరు వైకుంఠ నాథ్ బెహెరా (Baikuntha Nath Behera). ఇతను కంధమాల్ జిల్లా బలిగూడలోని ఐటీడీఏ(Integrated Tribal Development Agency) విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE)గా విధులు నిర్వహిస్తున్నాడు.
అధికారిక రికార్డుల ప్రకారం. ఇతను 1999లో ఓ సాధారణ జూనియర్ ఇంజినీర్‌గా కేవలం రూ.6,000 నెల జీతంతో ప్రభుత్వ సర్వీసులో చేరాడు. వివిధ గిరిజన అభివృద్ధి సంస్థలు, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తూ.. ఈ ఏడాది ప్రారంభంలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందాడు.
9 ప్రాంతాల్లో సోదాలు.. బయటపడిన ఆస్తులు
భువనేశ్వర్‌లోని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు జారీచేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా.. విజిలెన్స్ అధికారులు భువనేశ్వర్, బాలాసోర్, జాజ్‌పూర్, బరిపడ, బలిగూడ సహా మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడిన ఆస్తులు చూసి దర్యాప్తు అధికారులే షాకయ్యారు.
బ్యాంకు లాకర్లలో నోట్ల కట్టలు: బెహెరా కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన అధికారులకు నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. కేవలం లాకర్ల నుంచే దాదాపు రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఇళ్లల్లో జరిపిన సోదాల్లో మరో రూ.2.66 లక్షల నగదు పట్టుబడింది.
ఐదు భారీ బహుళ అంతస్తుల భవనాలు: భువనేశ్వర్‌లోని అత్యంత ఖరీదైన నీలాద్రి విహార్ ప్రాంతంలో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగంతస్తుల భవనంతోపాటు భువనేశ్వర్, జాజ్‌పూర్ జిల్లాల్లో కలిపి మొత్తం 5 బహుళ అంతస్తుల నివాస భవనాలు ఉన్నట్లు గుర్తించారు.
13 విలువైన స్థలాలు: భువనేశ్వర్ ప్రైమ్ ఏరియాల్లో ఉన్న 7 ప్లాట్లతో పాటు జాజ్‌పూర్, బరిపడ ప్రాంతాలలో మొత్తం 13 హై-వాల్యూ ల్యాండ్ డాక్యుమెంట్స్ కనుగొన్నారు.
బంగారం, డిపాజిట్లు: నిందితుడికి చెందిన బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్, ఇతర ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ల విలువను లెక్కించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
లగ్జరీ లైఫ్.. కొనసాగుతున్న విచారణ
చంద్రశేఖర్‌పూర్, శైలశ్రీ విహార్, కానన్ విహార్‌లోని సదరు ఇంజినీర్ నివాసాలతోపాటు బలిగూడలోని క్వార్టర్స్, ఆఫీస్ ఛాంబర్లలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ భారీ ఆపరేషన్‌లో పలువురు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో కూడిన పెద్ద బృందం పాల్గొంది. స్వాధీనం చేసుకున్న లగ్జరీ ప్రాపర్టీలు, స్థలాల అసలు మార్కెట్ విలువను కచ్చితంగా అంచనా వేయడానికి విజిలెన్స్ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. సోదాలు, వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఈ అక్రమాస్తుల మొత్తం విలువపై పూర్తి స్పష్టత రానుందని, నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

