Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సర్‌'ను సీరియస్‌గా తీసుకోండి..  సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

'సర్‌'ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

మరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మహానాడును వర్చువల్‌గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు.

రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, బీఎల్ఏలు హాజరయ్యారు.

నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్..

వారికి సర్‌పై శిక్షణతో పాటు ఓటర్ల జాబితా రివిజన్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శిక్షణ తరగతులకు హాజరుకాని నేతలపై సీరియస్ అయ్యారు. సర్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. జులై 14వ తేదీ లోపు ఓట్లు ఉండేలా చూసుకోపోతే ఇబ్బందులు తప్పవని మందలించారు. సర్‌పై మూడు పార్టీలతో కో-ఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తామని తెలిపారు. జులై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. సర్‌లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సర్‌ను అందరూ సీరియస్‌గా తీసుకోవాలని... ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశించారు. ఓట్ల ఎన్‌రోల్‌మెంట్ జరుగుతోందని తెలిపారు. ప్రతీ 20-25 ఏళ్లకోసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ జరుగుతుందని ప్రస్తావించారు. 2002 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుని స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియను చేపడుతున్నారని అన్నారు. జులై 14వ తేదీలోగా రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారని వివరించారు.

ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

ఈ రెండుసార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు ఖచ్చితంగా పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఓటర్‌గా నమోదు చేసుకోవడం.. ప్రజల బాధ్యత అని సూచించారు. ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితా అనేది చాలా కీలకమని అన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలమని.. ప్రణాళికలు సిద్ధం చేసుకోగలమని తెలిపారు. పార్టీ బలంగా ఉంటే... ప్రభుత్వం మరింత బలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సర్‌పై రోజూ మానిటర్ చేస్తామని అన్నారు. మన ఓట్లు ఉన్నాయా..? లేవా..? అనేది నిరంతరం చూసుకోవాలని సూచించారు. ఏపీలో స్థానికులు వివిధ రకాల కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తారని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు పెద్దఎత్తున వచ్చి ఓట్లేయడం వల్లే కూటమికి 164 సీట్లు వచ్చాయని ప్రస్తావించారు. కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తామని.. మిగిలిన రోజుల్లో పట్టించుకోమంటే కుదరదని సీఎం హుకుం జారీ చేశారు.

జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకోవాలి..

ప్రభుత్వంలోనే కాదని.. అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తన రాజకీయ చరిత్రలో 2024 ఎన్నికల్లో సాధించిన ఘన విజయం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. కొత్త వారికి టికెట్లు ఇచ్చినా.. కూటమి పార్టీ అభ్యర్థి అనగానే ఓటేశారని చెప్పారు. పార్టీల మధ్య సమన్వయానికి సర్ మొదటి టెస్ట్ అని తెలిపారు. చాలామంది అనుచరులను కోరుకుంటారని... కానీ తాను నాయకులను కోరుకుంటానని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పార్టీకి బలం పెరుగుతుందని అన్నారు. 2024 ఎన్నికల ముందు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచామని తెలిపారు. పూర్తిస్థాయిలో గ్రౌండ్‌వర్క్.. టెక్నికల్ వర్క్ చేసి అద్భుత విజయం సాధించామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి చూపించామని చెప్పారు. గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ఒకప్పుడు పోటీ చేసేవాళ్లం కాదని.. కానీ నాడు ఆ ఎన్నికల్లో పోటీ చేశామని తెలిపారు. ఆ ఎన్నికల్లో గెలిచామని.. అదీ మన నెట్‌వర్క్‌కు ఉన్న గొప్పదనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

కుట్రలు చేసేందుకు గొడ్డలి పార్టీ వెనకాడదు..

ఓటరు జాబితా నుంచి మన ఓట్లు తీసేసి.. వాళ్ల ఓట్లు చేర్చేలా కుట్రలు చేసేందుకు గొడ్డలి పార్టీ వెనకాడదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండేళ్లల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని అన్నారు. 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టాలని.. పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ఇంటింటి ప్రచారంలో తాను కూడా పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈ ఇంటింటి ప్రచారంలో సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలని హుకుం జారీ చేశారు. వీలుంటే ఈ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలని.. తాను కూడా సైకిల్ మీదే ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారని.. తాను నాలుగోసారి సీఎంగా ఉన్నానని ప్రస్తావించారు. వీటితో పాటు మన ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.

ఈ నెల 21న యోగా డే..

ఈ నెల 21వ తేదీన యోగా డే నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. అమరావతిలో 25 వేల మందితో యోగా నిర్వహిస్తామని వివరించారు. యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. టీడీపీ అందరికి చెందిన పార్టీ అని... తెలుగు వాళ్ల పార్టీ అని వ్యాఖ్యానించారు. ప్రతివర్గాన్ని మనం ఓన్ చేసుకోవాలని నిర్దేశించారు. సోషల్ రీ-ఇంజినీరింగ్ చేసి పదవులు, సీట్ల కేటాయింపులు చేశామని అన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ.. పార్టీ పదవుల్లోనూ సోషల్ రీ-ఇంజినీరింగ్ చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

.

పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరు: సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy