Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం

సెయింట్‌ లూయిస్‌లో వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం

మిస్సోరిలోని ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగి దివ్యమైన పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసింది.

ప్రపంచశాంతి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ, సమస్త ప్రజల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం నిర్వహించిన ఈ మహాయాగంలో అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని విశేష భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ప్రతిరోజూ ఉదయం గోమాత పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు మహాన్యాస పారాయణం, రుద్రహోమం, చండీ హోమం, వారాహి హోమం, అరుణ హోమం, రాజశ్యామల హోమం వంటి అనేక విశిష్ట వైదిక క్రతువులతో యాగశాలను ఆధ్యాత్మిక తేజస్సుతో నింపాయి. ముఖ్యంగా రెండో రోజు నిర్వహించిన దశసహస్ర మోదక హోమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గణపతికి ప్రీతికరమైన పది వేల మోదకాలను ఆలయ వాలంటీర్లు స్వయంగా భక్తితో సిద్ధం చేయడం ఈ మహాయాగంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

యాగం చివరి రోజు అత్యంత పవిత్రంగా, భావోద్వేగభరితంగా సాగింది. యాగానికి సంకల్పదాతలైన స్పాన్సర్లతో కలిసి పవిత్ర కలశాలను యాగ ప్రదక్షిణ చేయించి, ఆ దివ్య కలశ జలాలతో శివునికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం దీక్షలో ఉన్న భక్తులకు శాస్త్రోక్తంగా అవభృత స్నానం జరిపారు. తరువాత శివాభిషేకం, అర్చన, మంత్రపుష్పం, వేదపఠనం నిర్వహించగా, యాగ సమాప్తి సందర్భంగా జరిగిన పూర్ణాహుతి సమయంలో వర్షం కురవడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. దీనిని దేవతల అనుగ్రహానికి, యాగసంపూర్ణతకు శుభసూచకంగా భావించిన ఋత్వికులు, ఈ మహాయాగం అత్యంత విజయవంతంగా పూర్తైందని వివరిస్తూ విశిష్ట ప్రవచనం చేశారు. వారి ఆధ్యాత్మిక సందేశం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం ఎదుట ఏర్పాటు చేసిన సుమారు 90 అడుగుల విశాల వేదికపై నిర్వహించిన షట్ కల్యాణ మహోత్సవం ఈ మహాయాగానికి అపూర్వ శోభను తీసుకొచ్చింది.

ఒకే వేదికపై, ఒకేసారి శ్రీ రాధాకృష్ణుల కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ శివపార్వతుల కళ్యాణం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ దివ్య దృశ్యాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. "రెండు కళ్ళు చాలవు" అన్నట్లుగా సాగిన ఈ మహోత్సవం ఆలయ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. అనంతరం వేదపండితులు కల్యాణ మహోత్సవాల ఆధ్యాత్మిక విశిష్టతను వివరించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆలయ యాజమాన్యం వేదపండితులను ఘనంగా సత్కరించింది. అలాగే ఈ ఆరు రోజుల మహాకార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన కమిటీ సభ్యులు, వాలంటీర్లు, సేవాదారులను ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా యాగ కమిటీ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ మాట్లాడుతూ, భక్తుల సహకారం, వాలంటీర్ల నిస్వార్థ సేవ, దాతల ఉదారత, వేదపండితుల అంకితభావం వల్లే ఈ మహాయాగం అపూర్వ విజయాన్ని సాధించిందని తెలిపారు.

వైస్ చైర్మన్ విజయ్ కె. సాక్షి, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి మురళీకృష్ణ పుట్టగుంట, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేని తదితరులు యాగ నిర్వహణలో విశేష సేవలందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మహాయాగంలో భక్తులకు ఆతిథ్యం అందించడంలో ఆహార కమిటీ చైర్మన్లు రాజేష్ ఎవూరి, సతీష్ లంక నాయకత్వంలో వందలాది మంది వాలంటీర్లు విశేషంగా సేవలందించారు. యాగం ఆరు రోజుల వ్యవధిలో సుమారు 25,000 మందికి మహాప్రసాద భోజనాలు అత్యంత సక్రమంగా, భక్తిపూర్వకంగా వడ్డించడం ఈ మహోత్సవంలోని మరో విశేష ఘట్టంగా నిలిచింది. ఇలాంటి మహాయాగాలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని భావితరాలకు చేరవేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

చివరగా భక్తులందరికీ తీర్థ ప్రసాదం, మహాప్రసాదం పంపిణీ చేయగా, వేలాది మంది భక్తులు దివ్యానుభూతితో ఆలయం నుంచి తిరిగి వెళ్లారు. ఆరు రోజులపాటు వేదఘోషలు, హోమాగ్నులు, దేవీదేవతల ఆరాధన, భక్తుల సామూహిక ప్రార్థనలతో మార్మోగిన ఈ నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఉత్తర అమెరికాలో నిర్వహించిన అత్యంత వైభవోపేతమైన వైదిక మహోత్సవాల్లో ఒకటిగా నిలిచింది. భక్తి, సేవ, సమిష్టి సహకారం, వైదిక సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ మహాయజ్ఞం, పాల్గొన్న ప్రతి భక్తి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక దివ్య ఆధ్యాత్మిక అనుభూతిగా మిగిలింది.

ఈ వార్తలనూ చదవండి:

ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ బోనాల పండుగ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy