Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

మరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్లే... ఇకపై ప్రతి శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు.

ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయించామని పేర్కొన్నారు. సీఎం నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రీవియన్స్ డే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

ప్రజాప్రతినిధులు - అధికారులు కలిసి గ్రీవియన్స్ డే నిర్వహించాలి..

పీజీఆర్ఎస్ విధానంలో ప్రజాప్రతినిధులు - అధికారులు కలిసి గ్రీవియన్స్ డే నిర్వహించేలా చూడాలని సీఎం సూచించారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని వ్యాఖ్యానించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దామని తెలిపారు. సింగపూర్‌లో ఇదేరకంగా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.

ప్రభుత్వానికి మంచి పేరు..

సమస్యలు పరిష్కారమైతే ప్రభుత్వానికి మంచి పేరురావటంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫీల్డ్ గ్రీవెన్స్ డే చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజల వద్ద ఆయా సమస్యల కాగితాలు తీసుకుని వదలిపెట్టకుండా.. ఈ పిటిషన్లకు పరిష్కరించాలని హుకుం జారీ చేశారు. ప్రతీ నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగుసార్లు సందర్శించాలని దిశానిర్దేశం చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్‌గా కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు.

అధికారులు అలా చేయొద్దు..

సంక్షేమంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చర్చించారు. కలెక్టర్లు గ్రీవెన్స్ పేరుతో అర్జీలు తీసుకోని కాగితాలు కారులో పెట్టేస్తున్నారని.. అలా చేయొద్దని ఆదేశించారు. అందుకే చాలా వరకూ ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ప్రతి నెల చివర తేదీ రాగానే సమస్యలు పరిష్కారమైనట్లుగా బాధితునికి కాకుండా వేరే అడ్రస్‌కు కాగితాలు పంపేసి చేతులు దులుపుకుంటున్నారని.. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. వారంలో ఒక రోజు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ పెట్టినా.. మరోరోజు ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల వద్ద నుంచి అర్జీలు తీసుకోవాలని సూచించారు. అయితే, వారంలో రోజుకొకరు వీడియోకాన్ఫరెన్స్‌లు పెడుతున్నారంటూ కలెక్టర్‌లు ఫిర్యాదు చేశారు. ఇకపై వీడియో కాన్పురెన్స్‌లు అన్ని ఒకేరోజు ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy