ఇంటర్‌నెట్ డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విజయ్ ఆంటోనీ తమిళంలో తీసిన 'పిచ్చైకారన్' సినిమా తెలుగులో 'బిచ్చగాడు'గా డబ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది.
ఆయనకు తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చింది. తమిళంలో ఆయన తీసిన సినిమాలు అన్నీ తెలుగులో డబ్ అయి విడుదల అవుతున్నాయి. మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. పిచ్చైకారన్ దర్శకుడు శశి, విజయ్ ఆంటోనీ కాంబినేషన్‌లో 'నూరు సామి' సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్ జోరుగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటోంది. విజయ్ ఆంటోనీ తాజాగా, మీడియా ప్రతినిధుల సమావేశంలో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసే విషయం ఒకటి చెప్పారు. మూడేళ్ల తర్వాత చెన్నై వదిలి పల్లెటూరుకు వెళ్లిపోతానని ఆయన ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే.. 'నేను ఎక్కువగా సింపుల్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతాను. వృత్తి కారణంగానే చెన్నై నగరంలో ఉంటున్నాను. శ్రీధర్ వెంబు (జోహో అధినేత) సార్ లాగా తెన్‌కాశీలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను'..
'ఈ సినిమా షూటింగ్ కల్లకురూచి'లో చేశాం. అక్కడి వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. గ్రామీణ జీవితం గడపాలని ఎంతో ఆశపడుతున్నా. కొంతమంది గ్రామీణ ప్రజలు మాల్స్, ఇతర ఆకర్షణల కారణంగా నగరాల్లో సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. కానీ, నగరాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. గ్రామాల్లో తాజా గాలి, అనుబంధాలు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గ్రామీణ ప్రజల జీవితమే నిజమైన జీవితం' అని అన్నారు. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు చెప్పకనే చెప్పారు.

