Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

హైదరాబాద్‌: మే 13, (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ (Telangana DGP CV Anand) స్పష్టం చేశారు.

ఈరోజు (బుధవారం) ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, పశుసంవర్ధక శాఖ సెక్రటరీ కే. ఇలంబర్తి తదితరులతో కలిసి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన చర్చలు, అనంతరం ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశ నిర్ణయాల మేరకు ఈ నెల 27వ తేదీన జరిగే బక్రీద్‌ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఘర్షణలు తలెత్తకుండా వ్యవహరించాలి..

బక్రీద్‌ పండుగ ఇతర పండుగల కంటే అత్యంత సున్నితమైనదని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల పశువుల అక్రమ రవాణా ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల రవాణా విషయంలో కౌ స్లాటర్ యాక్ట్-1977, ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్-1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ-1960 చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పశువుల సంతలపై ప్రత్యేక నిఘా..

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతరాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని, ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెక్ పోస్టుల వద్ద పశువుల రవాణాకు సంబంధించిన 'ఫీట్ టు ట్రాన్స్‌పోర్టేషన్', 'ఫిట్ టు స్లాటర్' వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పండుగ ముగిసే వరకు ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగాలని ఆదేశించారు.

అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు..

శాంతిభద్రతల విషయంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పశువుల రవాణాపై ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప, నేరుగా రోడ్లపైకి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించకూడదని ఖురేషీలు, గోరక్షక బృందాలకు సూచించారు. నిబంధనలు మీరి రాద్ధాంతం చేసే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు రెండువర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని మార్గనిర్దేశం చేశారు.

అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి..

పోలీస్, మున్సిపల్, పశుసంవర్థక, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సీజ్ చేసిన పశువులను సంరక్షించేందుకు తగిన విస్తీర్ణంలో క్యాటిల్ పాండ్‌లను ఏర్పాటు చేయాలని, అక్కడ పశువులకు అవసరమైన సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గందరగోళం సృష్టించేలా పోస్టులు పెట్టే వారిని స్టేషన్లకు పిలిపించి హెచ్చరించాలని చెప్పారు. గతంలో బక్రీద్ సందర్భంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

అధికారులు అప్రమత్తతో ఉన్నారు: జయేశ్ రంజన్

మున్సిపల్ అధికారులు బక్రీద్ పండుగ నేపథ్యంలో అప్రమత్తతో ఉన్నారని స్పెషల్ సీఎస్ (ఎంఏయూడీ) జయేశ్ రంజన్ తెలిపారు. కౌ స్లాటర్ యాక్ట్, ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అలాగే, పశుసంవర్ధక శాఖ సెక్రటరీ కె. ఇలంబర్తి మాట్లాడారు. పశువుల రవాణాకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇచ్చేందుకు వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో వెటర్నరీ డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపీ, శాంతిభద్రతల డీజీపీ మహేశ్ ఎం భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, కార్తికేయ, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్ తదితరులు తగు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

.

మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy