Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సంక్లిష్టం చేసుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్‌కు పడిపోయింది.

ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అన్షుల్ కాబోజ్. టోర్నీ ఆరంభం నుంచి కీలక బౌలర్‌గా మారిన అతడిని లఖ్‌నవూ బ్యాటర్లు టార్గెట్ చేయడం సీఎస్కేను దెబ్బకొట్టింది. వేసిన 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్.. అన్షుల్ కాంబోజ్‌పై విరుచుపడ్డారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి.. అన్షుల్‌కు మద్దతుగా నిలిచాడు.

'క్రికెట్‌లో ప్రతి ప్లేయర్ తప్పులు చేస్తాడు. కానీ వాటి నుంచి నేర్చుకోవడమే ముఖ్యం. మిచెల్ మార్ష్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తర్వాత అన్షుల్ తన వ్యూహాన్ని మార్చాల్సింది. యార్కర్లు లేదా ఆఫ్ స్టంప్ బయట ఎత్తయిన బౌన్సర్లు వేయాల్సింది. ఛాతీ లేదా నడుము స్థాయి ఎత్తులో బంతులు సంధిస్తే.. మార్ష్ లాంటి ప్లేయర్లు అద్భుతంగా ఆడేస్తారు. ఈ మ్యాచ్‌లో విఫలమైనందుకు కాంబోజ్ బాధ పడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌లో అతడు విలువైన పాఠం నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. అన్షుల్.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఇక్కడ ముఖ్యం. ఓటమి పాలైనప్పటికీ సీఎస్కే అద్భుత ప్రదర్శనే చేసింది. లఖ్‌నవూ పిచ్‌పై 187 పరుగులు చేయడం చిన్న విషయం కాదు. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్.. ఫామ్‌లోకి వస్తే జట్టుకు మరింత బలం చేకూరుతుంది' అని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

అన్షుల్ చెత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును కాంబోజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో నాలుగేసి సిక్స్‌లను రెండుసార్లు ఇచ్చిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. కేవలం 2.4 ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే సీఎస్కే ఓటమికి ప్రధాన కారణంగా మారింది. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న స్టార్ బౌలర్ నుంచి ఇలాంటి ప్రదర్శన రావడంతో చెన్నై అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లో సీఎస్కే గెలవాల్సిన పరిస్థితి. తన తదుపరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మే 18న తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy