Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం

తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం

హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) సరికొత్త వేగాన్ని పుంజుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు కంటే ముందే పూర్తి అవుతూ, రికార్డు స్థాయి గణాంకాలను నమోదు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ సమర్థవంతమైన పర్యవేక్షణతో ఈ నెలలో పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోంది. గడువు కంటే ముందే 85శాతం పైగా బియ్యం పంపిణీ జరిగింది. ఏప్రిల్ 21వ తేదీ నాటికే 5.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. మొత్తం లక్ష్యం 6.43 లక్షల MT ఇప్పటికే 86శాతం పూర్తి అయింది. రాష్ట్రవ్యాప్తంగా 2.62 కోట్ల ట్రాన్సక్షన్స్ విజయవంతం అయ్యాయి.

వేగవంతమైన పంపిణీకి ప్రధాన కారణాలు..

రాబోయే కాలానికి సంబంధించి (ఏప్రిల్ - జూన్) రేషన్ కోటాను ముందుగానే పంపిణీ చేయాలని కేంద్రం ప్రభుత్వం సూచించింది. దీనివల్ల లబ్ధిదారులకు సకాలంలో ఆహార ధాన్యాలు అందుతున్నాయి. గోదాముల్లో నిల్వ సామర్థ్యానికి ఇబ్బంది కలగకుండా, కొత్త ధాన్యం సేకరణకు స్థలం కల్పించే లక్ష్యంతో పంపిణీని వేగవంతం చేశారు. ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పంపిణీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ-పాస్ (e-PoS) యంత్రాల ద్వారా వేలిముద్రల సేకరణతో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పారదర్శకత, పర్యవేక్షణ..

రేషన్ షాపుల వద్ద ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచారు. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సర్వర్లను పటిష్ఠం చేయడంతో, ప్రజలు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పంపిణీ సాగుతోంది. నెల పూర్తి కావడానికి ముందే 86శాతానికి పైగా పంపిణీ పూర్తి కావడంపై రేషన్ కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గడువు ముందే రేషన్ పూర్తి అనే నినాదం క్షేత్రస్థాయిలో నిజమవుతోంది. కేవలం 21 రోజుల్లోనే 86 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా, దేశంలోనే సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy