Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళలు వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతున్నారు.

మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సెమీ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని హర్మన్ సేన పట్టుదలతో ఉంది. ఇప్పటికే పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లను భారీ తేడాతో ఓడించి.. మెరుగైన నెట్‌ రన్ రేట్‌తో టీమిండియా గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉంది.

ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో, నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. దీప్తి శర్మ, శ్రీచరణి బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాక్‌పై దీప్తి శర్మ 5 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. భారత్ విజయావకాశాలు టాప్ ఆర్డర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. పవర్‌ప్లేలో మంధాన దూకుడు, షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అనుభవం, రిచా ఘోష్ ఫినిషింగ్ సామర్థ్యం జట్టుకు ప్రధాన బలాలు. అదే సమయంలో బౌలింగ్ విభాగంలోనూ భారత్ సమతూకంగా కనిపిస్తోంది.

శ్రేయాంక స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక గాయం కారణంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో ప్రేమ రావత్‌ను జట్టులోకి తీసుకున్నారు. కీలక సమయంలో బ్రేక్ థ్రూ అందించే శ్రేయాంక లేకపోవడం జట్టుకు ఎదురుదెబ్బే. ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే మరో స్పిన్నర్ రాధా యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సౌతాఫ్రికా సైలెంట్ కిల్లర్..

దక్షిణాఫ్రికా జట్టు కూడా ప్రమాదకర ప్రత్యర్థే. ఈ టోర్నీలో ప్రోటీస్ జట్టు ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత పాకిస్థాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించి పుంజుకుంది. కెప్టెన్ లారా వోల్వార్ట్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తే భారత్‌కు గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. మాంచెస్టర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ స్పిన్ దళం కీలకంగా మారనుంది. దీప్తి శర్మతో పాటు ఇతర స్పిన్నర్లు కూడా ప్రభావం చూపగలిగితే మ్యాచ్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించే అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పటివరకు భారత్‌కు అతిపెద్ద సానుకూల అంశం జట్టు సమిష్టి ప్రదర్శన. ఒక్క ప్లేయర్‌పైనే ఆధారపడకుండా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమష్టిగా రాణించడం జట్టుకు అదనపు బలం. అయితే ఒత్తిడిని తట్టుకుని తిరిగి పుంజుకునే సామర్థ్యం ఉన్న దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆల్‌రౌండర్లు, మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ఈ పోరు గ్రూప్ దశలోనే అత్యంత ఆసక్తికర సమరంగా మారనుంది. టైటిల్ రేసులో తాము బలమైన పోటీదారులమని నిరూపించుకోవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం ఎంతో కీలకం.


ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy