Dailyhunt
టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ.. తొలి కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ.. తొలి కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)లో భాగంగా నిన్న(బుధవారం) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లో శతకం బాది.. పాక్ జట్టు పతనాన్ని శాసించాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేర్చిన హ్యారీ బ్రూక్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.

టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా పొట్టి ప్రపంచ కప్‌లో సెంచరీ చేయాలేదు. గతంలో 2010 ఎడిషన్‌లో విండీస్ సారథి క్రిస్ గేల్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నాడు.. అతను టీమిండియాపై 98 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కెప్టెన్ల పరంగా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఆ తర్వాత 2019 న్యూజిలాండ్‌పై ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) 91 పరుగులు చేశాడు.

అలానే పురుషుల టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా కూడా బ్రూక్(Harry Brook) రికార్డు సృష్టించాడు. అతడికంటే ముందు ఇంగ్లండ్ తరపున ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేశారు. 2014లో అలెక్స్ హేల్స్(116*), 2021లో జోస్ బట్లర్(101) ఇద్దరూ శతకాలు చేశారు. వీరిద్దరూ శ్రీలంకపైనే శతకాలు సాధించడం విశేషం. కానీ వారు కెప్టెన్లు కాదు. సారథిగా హ్యారీ బ్రూక్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు.

అలానే.. మరో రికార్డునూ బ్రూక్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా బ్రూక్ నిలిచాడు. గతంలో 2012లో పల్లెకెలెలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్‌హసన్.. పాకిస్థాన్(Pakistan)పై 84 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు అత్యధికం. 50 బంతులు సెంచరీ చేసిన బ్రూక్.. పొట్టి ప్రపంచ కప్‌లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గానూ నిలిచాడు. గతంలో 2016లో ఇంగ్లండ్‌పై గేల్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలానే 2007లో దక్షిణాఫ్రికాపై గేల్ 50 బంతుల్లో శతకం సాధించాడు. మొత్తంగా ఒక్క సెంచరీతో అనేక రికార్డులను బ్రూక్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy