Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వరుస వార్నింగ్‌లు ఇస్తున్నారు.

రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్‌కు ఎక్కువ సమయం లేదని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ త్వరపడకపోతే చివరకు వారికి ఏమీ మిగలదని అన్నారు. ఇరాన్‌పై అన్ని వైపుల నుంచీ దాడులు జరుగుతాయనేలా ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.

ఇక సంధి దిశగా అమెరికా పెట్టిన షరతుల గురించి ఇరాన్ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోగ్రాముల శుద్ధి చేసిన యూరేనియంను తమకు అప్పగించాలని యూఎస్ డిమాండ్ చేసినట్టు తెలిపింది. దేశంలో ఒకేఒక అణు రియాక్టర్ క్రియాశీలకంగా ఉండాలని, యుద్ధం పరిహారం కోరవద్దని కూడా యూఎస్ షరతు విధించింది. విదేశాల్లో ఇరాన్ నిధులను విడుదల చేసేది లేదని కూడా అమెరికా తేల్చిచెప్పినట్టు ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు ఇరాన్ కూడా పలు షరతులు విధించింది. లెబనాన్ సహా గల్ఫ్‌లో అన్ని చోట్లా దాడులకు ఫుల్ స్టాప్ పడాలని డిమాండ్ చేసింది. హోర్ముజ్‌పై తమ సార్వభౌమత్వాన్ని గుర్తించాలని అమెరికాను కోరింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఆంక్షలను తొలగించాలని, యుద్ధంతో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా ఇరాన్ పట్టుబడుతోంది.

ఇదిలా ఉంటే ఇరాన్‌లో అస్థిరతను సృష్టించేందుకు యూఎస్, ఇజ్రాయెల్‌లు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధక్ష్యుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదులను రెచ్చగొట్టి అస్థిరతను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. అయితే, పొరుగుదేశాలు ఇందుకు అంగీకరించకపోవడంతో వారి పాచిక పారలేదని అన్నారు. పాక్, అఫ్గానిస్థాన్, ఇరాక్‌లకు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy