ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగింది. ఏటా దీపం వెలిగించే ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంలోనే ఈసారి కూడా జ్యోతిని మంగళవారం వెలిగించారు.
‘దీపతూన్’ రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినా.. వివాదం నేపథ్యంలో దీపాన్ని ఎప్పటిలాగే ఉచ్చిపిళ్లైయార్ ఆలయానికి దగ్గరల్లో వెలిగించారు. కార్తీక దీపాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ మహత్తర దృశ్యాలు వీక్షించి ఆధ్యాత్మిక పరవశానికి లోనయ్యారు.
మరోవైపు సుప్రీం కోర్టు అనుమతి ఉన్నా జ్యోతిని ‘దీపతూన్’ వద్ద వెలిగించకపోవడంతో కొందరు ఆలయ సమీపంలో నిరసనలు చేపట్టారు. పలువురు బీజేపీ నేతలు, హిందూ సంఘాల కార్యకర్తలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారని సమాచారం. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు ఈనెల 20న సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. దీంతో కార్తీక దీపాన్ని ఉచ్చిపిళ్లైయార్ సమీపంలోని దీప మండపంలోనే వెలిగించారు.

