Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమాలకు ఊపిరిపోసిన స్వరం

ఉద్యమాలకు ఊపిరిపోసిన స్వరం

దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై, నక్సల్బరీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత-బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు తన గాత్రంతో ఊపిరి పోశారు గద్దర్‌.

ఆయన పాటలు ప్రభుత్వాలను ప్రశ్నించాయి, అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ''బండెనక బండి కట్టి...'', ''భద్రం కొడుకో...'', ''మదనసుందరి...'', ''భారతదేశం భాగ్యసీమరా...'', ''దళిత పులులమ్మా...'', ''జ్ఞానం ఒక్కరి సొత్తు కాదు...'', ''అడవి తల్లికి వందనం...'', ''మల్లె చెట్టుకు పందిరివోలె...'' వంటి వందలాది పాటలు ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆలపించిన ''పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా... పోరు తెలంగాణమా...'' అనే గీతం ఉద్యమానికి అపూర్వమైన సాంస్కృతిక శక్తిని అందించింది. ఆ పాట అనంతరం తెలంగాణ ఉద్యమం మరింత వేగం పుంజుకుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై జరిగిన హత్యాయత్నం భారత ప్రజాస్వామ్య చరిత్రలో సంచలనాత్మక ఘటన. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేయాలని ప్రయత్నించినప్పటికీ, మరణం అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆయనను భయపెట్టలేదు; ప్రజలతో ఆయన అనుబంధాన్ని మరింత బలపరిచింది. హత్యాయత్నం అనంతరం గద్దర్ కేవలం గాయకుడిగానే కాకుండా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షకుడిగా, సామాజికన్యాయ పోరాట యోధుడిగా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దళితులపై జరుగుతున్న హింసను నిరంతరం ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం రాజకీయ నాయకత్వంతోనే సాధ్యపడలేదు. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, భావోద్వేగాన్ని నింపిన సాంస్కృతిక ఉద్యమం కూడా అంతే కీలకం. ఆ ఉద్యమానికి గద్దర్ కేంద్రబిందువు. 1990ల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు వేలాది సభల్లో ఆయన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. గ్రామాల నుంచి నగరాల వరకు 'శబ్దం' వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో నాటారు. జిల్లాల వారీగా సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసి, పాటలు, నాటికలు, సభల ద్వారా ఉద్యమాన్ని సామాన్య ప్రజల జీవితంలో భాగం చేశారు. నీటి పంపిణీలో అన్యాయం, ప్రాంతీయ అసమానతలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, కుల వివక్ష, వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత వంటి సమస్యలను ఆయన పాటలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.

విప్లవ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు 2004లో ప్రభుత్వం-పీపుల్స్ వార్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన ఆలోచనలను విస్తరించుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, కుల నిర్మూలన, ప్రజాస్వామ్య హక్కుల కోసం తన గళాన్ని నిరంతరం వినిపించారు. జీవితాంతంలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ విలువలు, అణగారిన వర్గాల సాధికారతపై ఎక్కువగా దృష్టి సారించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరాన్ని ప్రజల్లో చాటిచెప్పారు. మణిపూర్ హింస, మహిళలపై దాడులు, క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, బిల్కిస్ బానో కేసు వంటి మానవ హక్కుల అంశాలపై కూడా తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ప్రజల బాధను స్వరంగా, స్వరాన్ని ఉద్యమంగా, ఉద్యమాన్ని చరిత్రగా మలిచిన మహోన్నత ప్రజా కళాకారుడు గద్దర్‌. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన గళం ఇంకా ప్రజల గొంతుల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన పాటలు ఇంకా ఉద్యమాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే గద్దర్ ఒక వ్యక్తి కాదు, ఒక యుగం. ఒక సిద్ధాంతం. ఒక శాశ్వత స్ఫూర్తి.

డా. జి.వి. వెన్నెల గద్దర్

చైర్‌పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి

(నేడు గద్దర్‌ వర్ధంతి)

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy