Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫేక్ పనీర్, నెయ్యి, వెన్నపై కొరడా

ఇంటర్నెట్ డెస్క్: కల్తీ, నకిలీ పాల ఉత్పత్తులపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కృత్రిమంగా తయారు చేసిన పనీర్‌, నెయ్యి, వెన్న తదితర నకిలీ డెయిరీ ఉత్పత్తుల తయారీ సహా వాటి నిల్వ, రవాణా, విక్రయాలపై నిషేధం విధించింది.

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

పాల నుంచి సహజంగా తయారు చేయాల్సిన పనీర్‌, నెయ్యి, వెన్న తదితర ఉత్పత్తుల్లో వెజిటబుల్స్ ఆయిల్, స్టార్చ్‌, ఇతర కెమికల్స్‌ను వాడి నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అసలైన పాల ఉత్పత్తులుగా వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా మార్కెట్‌ చేస్తున్న ఉత్పత్తులపైనా ఈ నిషేధం వర్తించనుంది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 కింద ఈ నిషేధాన్ని అమలు చేస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వినయ్‌ శంకర్‌ పాండే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు సురక్షిత, స్వచ్ఛ, నాణ్యమైన ఆహారం అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ సేఫ్టీ విభాగం తనిఖీలు చేపట్టనుంది. డెయిరీ యూనిట్లు, గోదాములు, హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌ షాపుల్లో సోదాలు నిర్వహించనున్నారు. అనుమానాస్పద ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించనున్నారు. అవసరమైతే సదరు వ్యాపార సంస్థల లైసెన్సులనూ రద్దు చేసే అవకాశం ఉంది. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy