Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ రాణిస్తే  టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

స్పోర్ట్స్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన హిట్టింగ్‌తో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో ఎంతో మంది స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

దీంతో టీమిండియా సీనియర్ జట్టుకు కూడా అతడు ఎంపికవ్వడంతో అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం వైభవ్‌ భారత-ఎ జట్టు తరఫున ఆడుతూ శ్రీలంకలో ఉన్నాడు.

ముక్కోణపు సిరీస్‌ ముగిశాక.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తోనూ పొట్టి ఫార్మాట్‌లో ఐదు మ్యాచులను భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను మరీ ఎక్కువగా విశ్లేషిస్తూ ఒత్తిడికి గురి చేయొద్దని క్రీడా విశ్లేషకులకు, అభిమానులకు సూచించాడు. వైభవ్ ఇలానే టెస్టుల్లోనూ రాణిస్తే.. ఆ ఫార్మాట్‌కు పునరుజ్జీవనం వస్తుందని అభిప్రాయపడ్డాడు.

'పరుగులు సాధించాలని అనుకోవడంతో పాటు ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనే బలమైన కోరిక వైభవ్ సూర్యవంశీలో ఉంది. అదే అతడిలో నాకు నచ్చే అంశం. క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆడగల సామర్థ్యం కూడా అతడిలో ఉంది. టీ20 క్రికెట్‌ నుంచి వన్డేలకు, ఆ తర్వాత టెస్టుల్లో వృద్ధి చెందితే మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌కు అద్భుతమైన కళ తీసుకురాగలడు. వైభవ్ లాంటి కుర్రవాళ్లే టెస్టు క్రికెట్‌ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషిస్తారు. వైభవ్‌ ఆటను చూసేందుకు అభిమానులు టీవీ ఆన్‌ చేస్తున్నారు. అభిమానులను ఆకర్షించే సత్తా అతడికి సహజంగానే వచ్చింది' అని క్రిష్ పేర్కొన్నాడు.

'వైభవ్‌ గురించి మరీ ఎక్కువగా విశ్లేషణలు చేసి, అతడిని అనవసర ఒత్తిడికి గురి చేయొద్దు. వైభవ్ సహజ సిద్ధంగా ఆటను ఆడేలా చూడాలి. ఒక్క సిరీస్‌లో ఏదైనా సరిగ్గా ఆడలేకపోతే వెంటనే సదరు ప్లేయర్‌ను ఆటను నిర్ణయించ వద్దు. కాస్త సమయం ఇవ్వాలి. తొలిసారి ఆడిన ఐపీఎల్‌లోనే అదరగొట్టాడు. ఇక ఇటీవల సీజన్‌లో చాలా అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం రాకపోయినా ఫర్వాలేదు. రిజర్వ్‌ బెంచ్‌లో ఉండనివ్వండి. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌ ఎలా ఉంటుందో అర్థం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి చిన్న జట్టైనా.. పెద్ద జట్టైనా సరే వైభవ్‌ను మాత్రం స్వేచ్ఛగా ఆడేలా చూడాల్సిన బాధ్యత టీమిండియా మేనేజ్‌మెంట్‌పై ఉంది' అని శ్రీకాంత్‌ వెల్లడించాడు.

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy