ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేక సాయం అందించనుంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వైభవ్ తల్లిదండ్రులూ అతడితో కలిసి ప్రయాణించేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. వారి ప్రయాణ, వసతి ఖర్చులన్నీ బోర్డే భరిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన వైభవ్.. తొలిసారిగా సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. కేవలం పదిహేనేళ్ల వయసులోనే అత్యున్నత స్థాయి అవకాశాన్ని అందుకున్న ఈ చిచ్చర పిడుగుకు కొత్త వాతావరణంలో అలవాటుపడేందుకు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం అవసరమని బీసీసీఐ భావిస్తోంది.
'వైభవ్ ఇంకా చిన్నోడే. అండర్ 19 స్థాయిలో అతడు తన వయసు ఆటగాళ్లతో కలిసి ఆడాడు. వారితోనే ప్రయాణించాడు. కానీ సీనియర్ జట్టు ఆటగాళ్లందరూ అతనికంటే చాలా పెద్దవారు. కాబట్టి అతని తల్లిదండ్రులు తోడుంటే బావుంటుందని భావించాం. అందుకే వారిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాం. దీంతో అతను కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటుపడతాడు. వారి ఖర్చులన్నీ బీసీసీఐ భరిస్తుంది' అని సైకియా తెలిపారు. భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్న వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ అందిస్తున్న ఈ మద్దతు అతడి కెరీర్‌కు మరింత బలం చేకూర్చనుంది.
ప్రస్తుతం.. వైభవ్ శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఏ జట్టుతో ఉన్నాడు. కాగా ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ చిచ్చర పిడుగు 776 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓ సెంచరీ, 5 అర్ధ శతకాలతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ సహా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులనూ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

