Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు

విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు

విజయవాడ, మే 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న (Budda Venkanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఏపీని నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో ప్రజాధనాన్ని దోచుకుని ప్రజలను మోసం చేశారని ఆగ్రహించారు. అందుకే వైసీపీకి 11సీట్లు ఇచ్చి.. కూటమికి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (ఆదివారం) విజయవాడ వేదికగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో నేడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో శరవేగంగా పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు విషం కక్కుతున్నారు..

అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహించారు. అమరావతి కేవలం రాజధాని కాదని.. మన రాష్ట్ర సంపద అని ఉద్ఘాటించారు. నేడు చంద్రబాబు పాలనపై నమ్మకంతో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. జగన్ హయాంలో కియా, అమర్ రాజా వంటి పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లేలా చేశారని దుయ్యబట్టారు. ఒక్క పరిశ్రమ కూడా వైసీపీ హయాంలో ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో అనేక పరిశ్రమలు ఏపీకి వచ్చాయని ప్రస్తావించారు. అవన్నీ జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాలని వైసీపీ నాయకులు అసత్య ప్రసారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏమాత్రం సిగ్గు లేకుండా రాజకీయ అవసరాల కోసం జగన్ అండ్ కో ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు పెట్టిన వారే చంద్రబాబు కారణంగా వచ్చామని చెబుతున్నారని అన్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్టికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఆయనకు మతిభ్రమించి చంద్రబాబు గురించి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు.

విజయసాయి ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా..

విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడితే దేహశుద్ది ఖాయమని బుద్దా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు గురించి అనవసరంగా మాట్లాడితే తమ తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ అధినేత ఇతరులపై వ్యక్తిగత దూషణలు చేయొద్దని చెప్పారని.. అందుకే తాము సంస్కారంతో మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. విజయసాయి రెడ్డి డిజిటల్ మీడియా ప్రారంభించిన రోజే.. తాను కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేస్తున్నానని స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డిని ఏ పార్టీ వారు చేర్చుకునేందుకు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. ఇప్పుడు కొత్త పార్టీ అని చెబుతున్న విజయసాయి రెడ్డి.. తన సొంత పార్టీ తరఫున సర్పంచ్‌గా గెలిచినా తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. చంద్రబాబు రాష్ట్రం, ప్రజల కోసం ఈ వయసులో ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ తెచ్చిందే చంద్రబాబు, లోకేశ్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఖ్యాతి చూసి కుళ్లుకుంటున్నారని విమర్శించారు. అందుకే వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్, విడదల రజనీ, ఇతర నేతలతో ఆరోపణలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ అండ్ కో ఐదేళ్లు అన్నివిధాలా ఏపీని నాశనం చేశారని.. ఇంకా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, అమరావతిపై విషం చిమ్మితే వైసీపీ నేతల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా జగన్ అండ్ కో తీరు మార్చుకుని కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు. లేకపోతే ఈసారి 11 సీట్ల నుంచి ఒక్క సీటుకే వైసీపీని ప్రజలు పరిమితం చేయడం ఖాయమని బుద్దా వెంకన్న విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy