ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భవిష్యత్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తున్నది.రాజకీయాల్లో కొత్త శకానికి ఆయన నాంది పలికారని చర్చ జరుగుతున్నది.
వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎటువంటి పొత్తు లేకుండానే ముందుకు వెళ్లేందుకు ఆయన ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే పార్టీ సీనియర్లకు ఆయన ముఖ్య సందేశం పంపించినట్టు సమాచారం. పార్టీలో చాలా కాలంగా ఉన్నామని, గెలుపోటముల్లో వెన్నుదన్నుగా ఉన్నామని.. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల కొందరు పెదవి విరిచినట్టు సమాచారం. ఈ విషయం కాస్త బాబు దగ్గరకు వెళ్లడంతో ఆయన ఓ సందర్భంలో ఎగ్జిట్ డోర్స్ ఖాళీగానే ఉన్నాయని పరోక్షంగా సంకేతం పంపించినట్టు తెలుస్తున్నది.
బాబు మదిలో ఏముంది?
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మూడు సార్లకంటే ఎక్కువే ప్రతిపక్ష నేతగానూ పనిచేశారు.దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( తండ్రీకొడుకుల) ప్రభుత్వాల్లో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడారు. వారి సమస్యలపై ప్రభుత్వాలను నిలదీశారు. ప్రస్తుతం ఆయనకు వయస్సు మీద పడుతోంది. వచ్చే టర్ము నాటికి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో నారా లోకేశ్ పార్టీని ముందుండి నడిపిస్తారని తెలుస్తున్నది. అందుకే ఈ టర్ములో నారా లోకేశ్‌కు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుతో పాటే మంత్రి పదవిని సైతం నిర్వహిస్తున్నారు. ఈ అనుభవం మున్ముందు పనికొస్తుందని బాబు అంచనాకు వచ్చినట్టు సమాచారం.
సీనియర్లకు మంగళం?
ఏదైనా పార్టీలో యువరక్తం, సీనియారిటీ రెండు అవసరం. పార్టీకి అధికారంలోకి తీసుకురావలంటే యువశక్తి చాలా అవసరం. ఇక అధికారంలోకి వచ్చాక పార్టీ, ప్రభుత్వంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలని అనుకున్నప్పుడు సీనియారిటీ పనిచేస్తుంది. అది గ్రహించే చంద్రబాబు గత ఎన్నికల్లో యువతకు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.భవిష్యత్‌లోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళతామని సమయం, సందర్భం దొరికిన ప్రతిసారి స్పష్టంచేస్తున్నారు. అయితే, పదవులు దక్కని కొందరు సీనియర్లు మాత్రం ఈ విషయంలో పార్టీ అధిష్టానాన్ని తప్పుబట్టడమే కాకుండా ఇతర నేతల వద్ద పెదవి విరుస్తున్నట్టు తెలిసింది. అందుకే చంద్రబాబు సీనియర్లకు పరోక్ష హెచ్చరికలు పంపినట్టు తెలుస్తున్నది.
బెంగాల్లో బద్దలైన దీదీ కోట.. 15 ఏళ్ల పాలనకు శుభంకార్డ్.. ఫలించిన మోదీ-షా వ్యూహం!
ఈ క్రమంలోనే తమకు పదవులు ఇవ్వడం లేదని, కోరిన వారికి టికెట్లు కేటాయించడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాధపడుతున్న వారికి చంద్రబాబు కాఫీ ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పదవులు అనుభవించిన వారు కొత్తవారికి చాన్స్ ఇస్తే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారని.. అలాంటి వారితో ఒక కాఫీ తాగుతానని చెప్పినట్టు సమాచారం. ఈ ప్రకారం వారు పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చని, లేదంటే వెళ్లిపోవచ్చని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుందని, పార్టీ మనుగడ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని సీనియర్లకు హింట్ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.చంద్రబాబు నిర్ణయంతో సీనియర్లు అయోమయంలో ఉన్నారని టాక్. ఇప్పుడు వారు వేరు పార్టీలోకి వెళ్లినా వారికి అవకాశాలు దొరకుతాయా? కనీసం వారి కుటుంబీలకు అయినా చాన్స్ దొరుకుతుందా? అని ఆలోచనలో పడినట్టు సమాచారం.

