Food poisoning: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మే 13వ తేదీన మిగిలిపోయిన బిర్యానీని, మరుసటి రోజు (14వ తేదీన) గ్రామస్తులు తిన్నారు.
నిల్వ ఉంచిన ఆ ఆహారం కలుషితం కావడంతో, గురువారం రాత్రి నుంచి ఆ గ్రామ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ ఆహార కాలుష్యం కారణంగా మొత్తం 50 మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితుల్లో ప్రస్తుతం 44 మంది కోలుకోగా, పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉన్న మరో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) విజయలక్ష్మి శుక్రవారం కొత్తరెడ్డిపాలెం గ్రామాన్ని స్వయంగా సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు.
