Petrol, Diesel Price Hike:దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు భయం సామాన్యులను వెంటాడుతోంది. ఇప్పటికే చమురు కంపెనీలు లీటరుకు రూ.3 వరకు ధరలు పెంచగా, మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
చమురు సంస్థలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ ధరలను ఈసారి ఏకంగా రూ.10 వరకు పెంచే అవకాశం ఉందంటున్నారు.
భారీగా పెరుగుతున్న ముడి చమురు ధరలు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, చర్చలకు ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం లాంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్ మీద కూడా పడుతోంది. ఇంకా చెప్పాలంటే, భారత్ ఎక్కువగా విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండటంతో, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే పరిస్థితి నెలకొంది.
పెద్ద మొత్తంలో ఆయిల్ కంపెనీలకు నష్టం!
నిపుణుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై సుమారు రూ.17 నుంచి రూ.18 వరకు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ లాస్ ను పూడ్చుకోవాలంటే ధరలు మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా రూ.10 మేర తగ్గించింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఆ తగ్గింపు సరిపోవడం లేదంటున్నాయి ఆయిల్ కంపెనీలు.
దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం!
అటు ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధరమ మరో 10 డాలర్లు పెరిగితే భారత్ లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఫలితంగా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై కూడా ప్రెజర్ పడే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే దేశ జీడీపీపై ప్రభావం!
వాస్తవానికి జీడీపీ వృద్ధి అంచనాలపై కూడా క్రూడ్ ఆయిల్ ధరల పెంపు ప్రభావం కనిపించడం ప్రారంభమైందని నిపుణులు చెప్తున్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల ధరలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావంతో రిటైల్ ద్రవ్యోల్బణం సుమారు 0.25 శాతం వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
మధ్య తరగతిపై మరింత ఎఫెక్ట్
పెట్రోల్, డీజిల్‌తో పాటు వంటగ్యాస్, పాల ధరలు కూడా పెరుగుతుండటంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇంధన ధరలు, పాల ధరలు కలిసి పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 0.42 శాతం వరకు పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు.
Read Also: ఈ విమానానికి పెట్రోల్ అవసరం లేదు.. నీటితోనే ఎగిరిపోతుంది!

