Dailyhunt
పెరంబూరు ఎమ్మెల్యేగా విజయ్‌.. తిరుచ్చి ఈస్ట్ సీటుకు త్వరలో రాజీనామా!

పెరంబూరు ఎమ్మెల్యేగా విజయ్‌.. తిరుచ్చి ఈస్ట్ సీటుకు త్వరలో రాజీనామా!

Big TV Live 2 weeks ago

Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది.

చెన్నైలోని పనైయూర్‌ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో విజయ్‌ మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన వ్యక్తిగతంగా అభినందనలు తెలుపుతూనే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ.. మద్దతు కూడగట్టే అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు.

విజయ్‌ తన ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పెరంబూరు.. తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్లా గెలిచిన ఆయన.. పెరంబూరు ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిశ్చయించుకున్నారు. చెన్నై నడిబొడ్డున ఉన్న పెరంబూరును తన రాజకీయ స్థావరంగా ఉంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి ఆయన త్వరలోనే రాజీనామా చేయనున్నారు. నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు చోట్లా గెలిస్తే ఒకటి వదులుకోవాల్సి ఉండటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 118కి మరో 10 సీట్లు తక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే అంశంపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీల మద్దతు కోసం రాయబారాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ లేదా ఇతర సెక్యులర్ పార్టీలు తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల మద్దతును ఎలాగైనా కూడగట్టాలని విజయ్ వ్యూహరచన చేస్తున్నారు.

మరోవైపు డీఎంకే.. అన్నాడీఎంకేలు కూడా ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. ఏ కూటమి కూడా స్పష్టమైన మెజారిటీ సాధించకపోవడంతో తమిళనాడులో ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ లోపే మద్దతును సిద్ధం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. కేవలం పదవి కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టకుండా.. సుస్థిర ప్రభుత్వాన్ని అందించడమే తన లక్ష్యమని ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live