Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను -రాగ్ మయూర్‌

అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను -రాగ్ మయూర్‌

Chitrajyothy 1 week ago

రాగ్ మయూర్‌.. ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్ (Rag Mayur)..

2021లో ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'సినిమా బండి' (Cinema Bandi) ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తన తొలి చిత్రం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు - కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

''నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్‌ బాబు వంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. 'సినిమా బండి' చిత్రం నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా, నా కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది'' అని తెలిపారు. రాగ్ మయూర్‌కు 'సినిమా బండి' మూవీ మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత ఆయన 'వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీ తాత చెట్టు' వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు ఆయనని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ 'పంచాయత్‌'కు రీమేక్‌గా వచ్చిన 'సివరాపల్లి'.. నటుడిగా మొదటి నుంచి చివరి వరకు ఆయన ఓ ప్రాజెక్ట్‌ను మోయగలరని నిరూపించడమే కాకుండా, ప్రేక్షకుల నుంచి మంది ఆదరణను రాబట్టుకుంది.

''నేను నటించిన 'సివరాపల్లి' సూపర్‌హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాస్తున్నారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు దక్కిన గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో.. నటనలో విభిన్న కోణాలను అన్వేషించే ఛాన్స్ నాకు దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది'' అని రాగ్ మయూర్ వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "అది చిన్న క్యామియో పాత్రే అయినా, 'శుభం' వంటి ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంతకు కృతజ్ఞతలు'' అని తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ 'పరదా'తో పాటు, కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి'లోనూ ఆయన పోషించిన పాత్రలు మంచి గుర్తింపును పొందాయి. 'మిత్ర మండలి'లో చెప్పిన ఇంగ్లీష్ వన్ లైనర్స్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'గరివిడి లక్ష్మి'లోని పాత్ర గురించి చెబుతూ.. 'ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతగానో ప్రిపేర్ అయ్యి నటించాను' అని తెలిపారు. తన ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉందని చెప్పిన రాగ్ మయూర్.. ''నా కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను'' అని చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy