Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mera Lyari: 'ధురంధర్'కు కౌంటరా.. పాకిస్తాన్ సినిమాకు ఘోర అవమానం!

Mera Lyari: 'ధురంధర్'కు కౌంటరా.. పాకిస్తాన్ సినిమాకు ఘోర అవమానం!

Chitrajyothy 1 week ago

పాకిస్తాన్‌కు షాకిస్తూ.. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' (Dhurandhar) సిరీస్ చిత్రాలు ఎలాంటి సక్సెస్‌ను అందుకున్నాయో తెలియంది కాదు.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాలను చూసి పాకిస్తాన్‌కు ఏడుపొక్కటే తక్కువంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటి 'ధురంధర్'కు కౌంటర్ ఇస్తున్నామంటూ పాకిస్తాన్ ఈ మధ్య ఓ చిత్రం విషయంలో తెగ హడావుడి చేసింది. 'ధురంధర్'కు మేమిస్తున్న ధీటైన సమాధానం ఇదే.. అంటూ ప్రమోషన్స్‌లో కూడా చెప్పుకున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటంటే.. 'మేరా ల్యారీ' (Mera Lyari). మరి ఈ సినిమా నిజంగానే 'ధురంధర్'కు కౌంటర్ ఇచ్చిందా? అంటే, అసలు దరిదాపుల్లోకి కూడా రాలేదు.

అంతేకాదు, పాకిస్తాన్ పరువును మరింత దిగజార్చింది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలైన కొద్దిసేపటికే అనేక థియేటర్ల నుంచి తీసివేయబడిందని తెలుస్తోంది. అందుకు కారణం ప్రేక్షకాదరణ లేకపోవడమే. ఈ సినిమాకు మొత్తంగా కేవలం 22 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రచారంలో ప్రగల్భాలు పలికి, తీరా ఇలా విడుదలైన కొన్ని గంటల్లోనే థియేటర్ల నుంచి తీసేయడంతో పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది.

ఈ సినిమా కథా నేపథ్యం ఏమిటంటే.. దర్శకుడు అబు అలీహా తెరకెక్కించిన ఈ చిత్రం, కరాచీలోని 'ల్యారీ' ప్రాంతానికి ఉన్న నెగెటివ్ ఇమేజ్‌ను చెరిపేసేలా, అక్కడ మహిళా ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే స్ఫూర్తిదాయక కథాంశంతో రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతూ వచ్చారు. ఇందులో ఆయేషా ఒమర్, దననీర్ మోబీన్, సామియా ముంతాజ్, ట్రిన్నెట్ లూకాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' చిత్రంలో ల్యారీ ప్రాంతాన్ని క్రైమ్, తీవ్రవాదం, గ్యాంగ్ వార్స్‌కు నిలయంగా చూపించిన విషయం తెలిసిందే. రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి కౌంటర్‌గా 'మేరా ల్యారీ'ని పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేసింది. ఈ చిత్రానికి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రభుత్వం కూడా బహిరంగంగా మద్దతు తెలిపింది. రాజకీయంగా, మీడియాలో ఎంత హడావుడి జరిగినప్పటికీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. దీంతో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేసి, ఇతర చిత్రాలను ప్రదర్శిస్తున్నారంటే.. ఎంత అవమానకరమైన విషయమో అర్థం చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy