Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీల్లో ప్రకటనలు.. తల బాదుకుంటున్న చందాదారులు! ప్రమాదంలో అమెజాన్

ఓటీటీల్లో ప్రకటనలు.. తల బాదుకుంటున్న చందాదారులు! ప్రమాదంలో అమెజాన్

Chitrajyothy 2 weeks ago

కప్పుడు టీవీ ఛానళ్లలో వరుసగా వచ్చే ప్రకటనలకు విసిగిపోయిన ప్రేక్షకులు ఆపై ఓటీటీల (OTT)ను ఆశ్రయించారు. నెలవారీ చందా చెల్లిస్తే చాలు ఎలాంటి అంతరాయం లేకుండా సినిమా లేదా వెబ్ సిరీస్ చూడొచ్చనే నమ్మకమే ఓటీటీలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.

అయితే.. రాను రాను ఇప్పుడు అవే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రకటనలు విరివిగా కనిపించడం ప్రారంభమవడంతో వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కొన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు చందాదారులపై బలవంతంగా ప్రకటనలు రుద్దేస్తున్నాయి. ప్రకటనలు లేకుండా చూడాలంటే అదనపు చార్జీ చెల్లించాల్సిన పరిస్థితి తీసుకురావడంతో అనేక దేశాల్లో దీనిపై వివాదాలు మొదలయ్యాయి. దీంతో సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కూడా ప్రకటనలు ఎందుకు? అనే ప్రశ్న వినియోగదారుల్లో బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం ఓటీటీ రంగంలో పోటీ తీవ్రంగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిత్యం భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు రూపొందించడం, ప్రముఖ చిత్రాల డిజిటల్ హక్కులను భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం వంటి వాటితో కంపెనీలపై భారీ ఆర్థిక భారం పెడుతోంది. కేవలం సబ్‌స్క్రిప్షన్ ఆదాయంతో ఈ వ్యయాన్ని భర్తీ చేయడం ఆ యా సంస్థలకు కష్టంగా మారింది. దాంతో పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టేందుకు కొత్త ఆదాయ వనరుల కోసం మార్గాలు వెతుకుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. అందులో భాగంగా ప్రకటనల ద్వారా కొంత ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవాలని ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి.

అందుకే తక్కువ ధరతో యాడ్స్ ఉన్న ప్లాన్స్ ను, ఎక్కువ ధరతో యాడ్-ఫ్రీ ప్లాన్స్ ను అందుబాటులోకి తేవటం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవాని ఓటీటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు అమెజాన్, ఎమ్ ఎక్స్ ప్లేయర్, జియో హాట్ స్టార్ (JIO HOTTAR), ఆహా (AHA), జీ5 (ZEE 5) వంటి ఓటీటీ సంస్థలు ప్రకటనలకు గేట్లు తెరిచాయి. ముఖ్యంగా ప్రైమ్, జియో హాట్ స్టార్‌లో ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు అదనంగా అర గంట, జీ5, అమెజాన్ వంటి వాటిలో 15 నిమిషాల చొప్పున యాడ్స్ కి సమయం వెచ్చించాల్సి వస్తోంది. పైగా చూసే కంటెంట్ కంటిన్యుటీ మిస్ అయి చిరాకుతో మధ్యలోనే సదరు ఓటీటీలను బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అంతేకాకుండా వాటిలో వచ్చే ప్రకటనల్లో కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ వి కాకుండా పిల్లలు చూడలేనివి, అసభ్యకర కంటెంట్ కలిగినవి ఉండటం గమనార్హం.

ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ (NETFLIX) అవలంభిస్తున్న విధానం కూడా చర్చనీయాంశంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని దేశాలలో ప్రకటనలతో కూడిన ప్లాన్స్ ను ప్రవేశపెట్టినప్పటికీ, భారత్ లో మాత్రం అందుకు విరుద్దంగా ఉంటోంది. పోటీ ఓటీటీ సంస్థలు ప్రకటనలతో చెలరేగి పోతుంటే నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం అవేవి లేకుండానే యూనివర్సల్ కంటెంట్‌ను అందిస్తోంది. ఈ పద్దతే ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనినే సబ్ స్క్రైబర్స్ కోణంలో చూస్తే.. చందా చెల్లించిన తర్వాత కూడా ప్రకటనలు చూడాల్సి రావడం, వాటిని తొలగించాలంటే అదనపు డబ్బు చెల్లించాల్సి రావడం చాలా మందికి అసంతృప్తిని కలిగిస్తోంది.

ఇది వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్ళేలా చేస్తోంది. కొందరు ఇప్పటికే తమ చందాలను రద్దు చేసుకుని ఫ్రీ వెబ్సైట్లను అశ్రయించి తమకు కావల్సిన కంటెంట్ ను ఉచితంగా చూసేస్తున్నారు. ఓటీటీ సంస్థలు తాము పెట్టిన రాబడిని రాబట్టుకునే క్రమంలో ఆ భారం పూర్తిగా వినియోగదారులపై వేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుతం ప్రేక్షకులు లేక థియేటర్ల పరిస్థితి ఎలా తయారయిందో.. మున్ముందు ఓటీటీ సంస్థలు కూడా చందాదారులు లేక మూసేసుకోవలసిన పరిస్థితి ఎదురైనా అశ్చర్య పోవాల్సిన పనిలేదు.

చిక్కుల్లో.. అమెజాన్ ప్రైమ్

ఇదిలాఉంటే.. తాజాగా ఆస్ట్రేలియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో (AMAZON PRIME VIDEO) న్యాయ పరమైన చిక్కుల్లో పడింది. అల్రెడీ డబ్బు కట్టి చందాదారులుగా మారిని వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వారి సమ్మతి తీసుకోకుండానే ప్రైమ్ వీడియోలో ప్రకటనలు ప్రవేశ పెట్టారంటూ ఆ దేశ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ఫెడరల్ కోర్టును అశ్రయించింది.

అంతేగాక ప్రకటనలు లేకుండా చూడడానికి అదనపు రుసుము చెల్లించాలని కొత్త ఫ్లాన్ తీసుకు వచ్చిందని ఆరోపించింది. పైగా కొంతమంది సబ్ స్క్రైబర్లను కావాలని ప్రకటనలు వచ్చే ప్లాన్ లలోకి మార్చి యాడ్-ఫ్రీ అనుభవం కోసం అదనంగా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి కల్పించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే చర్య అని నియంత్రణ సంస్థ వాదిస్తోంది.

ఈ ఆరోపణలను అమెజాన్ ఖండించింది. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఈ-మెయిల్స్, యాప్ నోటిఫికేషన్ల ద్వారా వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇచ్చామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు డిజిటల్ రంగంలో చర్చనీయాంశంగా మారగా అక్కడ కోర్టు ఇచ్చే తీర్పును బట్టి మున్మందు కొత్త మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇష్యూ ఇతర ఓటీటీ సంస్థలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి:

Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా?

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy