RTC Bus | చిగురుమామిడి, సెప్టెంబర్ 02 : హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరగడంతో బస్సు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.
దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 2426 ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ కు 54 మంది ప్రయాణికులతో వెళుతుంది. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ ముమ్మరంగా పనులు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ హరీష్ సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన మూలమలుపు వద్ద బస్సును మలుపుతుండగా స్టీరింగ్ విరగడంతో బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న కావటి అనిల్ కుమార్ కు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
బస్సు ముందు టైర్లు బావి లోపలివైపు వెళ్లి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనలతో కేకలు వేశారు. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సులో నుండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులుండగా.. వీరిలో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చిగురుమామిడి మండలం నవాబుపేట కు చెందిన కె శిరీష, సిహెచ్ ఆర్యన్, హుస్నాబాద్ కు చెందిన ప్రమీల, రామచంద్రం, మురళీకృష్ణ, లాస్య, గాంధీ నగర్ కు చెందిన లచ్చవ్వ, దినేష్, మోత్కుపల్లికి చెందిన లలిత, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కు చెందిన కాంతమ్మ, రాముల పల్లెకు చెందిన కనకవ్వ, గౌరవెల్లి కి చెందిన కనకయ్య, నిమ్మలకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఎస్సై జగదీశ్వర్ పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు..
సుందరగిరి సమీపంలో ఆర్టీసీ బస్సు కావటి అనిల్ కుమార్ వ్యవసాయ బావిలోకి దూసుకెల్లగా సంఘటన స్థలాన్ని ఎస్సై జగదీశ్వర్ తోపాటు హుస్నాబాద్ డిఎం వెంకన్న, చిగురుమామిడి తాసిల్దార్ కోడం కనకయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బస్సును ప్రోక్లైన్ సహాయంతో బయటకు తీసి హుస్నాబాద్ కు తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని హుస్నాబాద్ ఆసుపత్రికి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. స్టీరింగ్ విరగడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.




