Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

1,000 రోజుల దగా పాలన!

Rama Rao September 2, 2026Telangana

హామీల అమలులో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యం
ప్రజలను వంచించిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు: బీఆర్‌ఎస్‌

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు..

420 హామీలు.. 13 డిక్లరేషన్లంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 1,000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ 1,000 రోజుల దగా పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు బుధవారం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ జయశంకర్‌ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు, పట్టణ బీఆర్‌ఎస్‌ మాజీ టౌన్‌ ప్రెసిడెంట్‌ కట్కం జనార్ధన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. 1,000 రోజులైనా అనేక హామీలను నెరవేర్చలేదని నాయకులు విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, నిరుద్యోగులకు ఉద్యోగాలు, భృతి తదితర హామీలను ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా అమలు చేశారని, రైతుబంధు విషయంలోనూ ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు.

హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని, అంతర్గత విభేదాలతో పాలనను గాలికొదిలేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా అధికార పార్టీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్‌ 8 వరకు పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

జర్నలిస్టులకూ మొండిచేయేనా?
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని నాయకులు విమర్శించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, మీడియా సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసి కేసీఆర్‌ నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు, కళ్లెపు రఘుపతిరావు, విద్యాసాగర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, గండ్ర హరీష్‌రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పీఏసీ చైర్మన్‌, మండల, జిల్లా నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News