Bala Raju September 23, 2026prabhanews.com
పేదలకు ఇంటి పట్టాల పంపిణీ
జగ్గారెడ్డి కృషితో తొగర్‌పల్లిలో 93 మందికి స్థలాల కేటాయింపు
పట్టాలు అందజేసిన నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఏళ్ల తరబడి సొంతింటి స్థలం కోసం ఎదురుచూస్తున్న తొగర్‌పల్లి, అలియాబాద్ గ్రామాల భూములు కోల్పోయిన పేదల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కృషి, విజ్ఞప్తితో తొగర్‌పల్లి సర్వే నంబర్ 418లో 93 మంది లబ్ధిదారులకు 125 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయిస్తూ పట్టాలు మంజూరయ్యాయి. బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత నిర్మలా జగ్గారెడ్డి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. తొగర్‌పల్లి, అలియాబాద్ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు 2011లో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. అయితే అనంతరం ప్రభుత్వం మారడంతో గతంలో జరిగిన కేటాయింపులు అమలుకు నోచుకోకపోవడంతో లబ్ధిదారులకు స్థలాల పొజిషన్ లభించలేదు. దీంతో సొంతింటి స్థలం కోసం వారు దశాబ్దానికి పైగా అధికారుల చుట్టూ తిరుగుతూ, ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పిస్తూ వచ్చారు.
గతంలో అసెంబ్లీలో ప్రస్తావించిన జగ్గారెడ్డి
లబ్ధిదారుల సమస్యను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. సమస్య పరిష్కారం కోసం గత ఏడాది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన మంత్రి అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫోన్ చేసి, లబ్ధిదారులకు స్థలాల పొజిషన్ చూపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
13 ఏళ్ల తర్వాత తొలి జీవో
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిషేధం కొనసాగుతూ వచ్చిందని, ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి విజ్ఞప్తి మేరకు తొగర్‌పల్లిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు 13 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలి జీవో వెలువడిందని అధికారులు, కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.
72 మంది తొగర్‌పల్లి.. 21 మంది అలియాబాద్
తొగర్‌పల్లికి చెందిన 72 మంది, అలియాబాద్ కు చెందిన 21 మంది లబ్ధిదారులకు కలిపి మొత్తం 93 మందికి 125 గజాల చొప్పున ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. పట్టాలు చేతికి అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, సీడీసీ చైర్మన్ గడీల రామ్‌రెడ్డి, నాయకులు మస్కు నర్సింహారెడ్డి, కొండాపూర్, అలియాబాద్ గ్రామాల సర్పంచులు, కొండాపూర్ తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
