Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

2027 జనగణనలో బీసీ కులగణన కాలమ్‌ చేర్చాలి

Nagamani Malligari October 24, 2026prabhanews.com

డిక్లరేషన్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌

బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌

ఖానాపూర్‌ టౌన్‌, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2027 జనగణనలో బీసీ కులగణన కాలమ్‌ను చేర్చాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలోని సీఎం రావు ఫంక్షన్‌ హాల్‌లో శనివారం బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్ల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులాలవారీగా జనాభా లెక్కలతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించి ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందన్నారు.

దేశ జనాభాలో బీసీలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో ఉంటేనే విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, బడ్జెట్‌ కేటాయింపుల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని దండి వెంకట్‌ పేర్కొన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం బీఎల్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్‌ సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజాస్వామికవాదులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, రైతు, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఎంసీపీఐయూ నిర్మల్‌ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్‌, బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు సబ్బని లత మాట్లాడుతూ బీసీ కులగణన లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి మంచుకంటి లక్ష్మణ్‌, జాయింట్‌ సెక్రటరీ కే. సంజీవ్‌, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి మహమూద్‌, సహాయ కార్యదర్శి భోజన్న, బీఎల్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బోదాస్‌ గణేష్‌, సూర రాజన్న, హైమద్‌ ఖాన్‌, నరసయ్య, కే. మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు కమల, సరూప, సీహెచ్‌. కళ, విద్యార్థి సంఘం నాయకుడు సీహెచ్‌. ఆనంద్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News