Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

20-lakh-ornaments-theft-sai-baba-temple : సాయిబాబాకు శఠగోపం..! Andhra Prabha Crime Story

Babu Bahadur October 21, 2026Bihar temple theft, Lord Ganesha crown stolen, Motihari temple robbery, Rs 20 lakh temple theft, Sai Baba temple theft, Sai Baba umbrella stolen

20-lakh-ornaments-theft-sai-baba-temple : సాయిబాబాకు శఠగోపం..! Andhra Prabha Crime Story

  • ఆలయం లో పూజారి మొద్దు నిద్ర
  • దొంగల స్వేరవిహారం
  • బాబా గొడుగు.. వినాయకుడి కిరీటం మాయం
  • రూ.20 లక్షల ఆభరణాలు అపహరణ
  • బిహార్‌లోని మోతీహరిలో ఘటన
  • నెలన్నరగా సీసీ కెమెరాకు అంధత్వం
  • రంగంలో ప్రత్యేక దర్యాప్తు బృందం

(మోతీహరి(బీహార్‌), ఆంధ్రప్రభ ప్రతినిధి)

భక్తుల రద్దీతో నిత్యం సందడిగా ఉండే సాయిబాబా ఆలయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. రాత్రివేళ ఆలయంలోకి చొరబడి సాయిబాబా గొడుగుతోపాటు వినాయకుడి కిరీటాన్ని అపహరించారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. బిహార్‌లోని మోతీహరిలో ఉన్న ప్రసిద్ధ సాయిబాబా ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ తలుపును బద్దలుకొట్టి, గర్భగుడి లోపలి గడియను బలవంతంగా తెరిచి దుండగులు విలువైన వస్తువులతో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

గొడుగు.. కిరీటం మాయం

మోతీహరి పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మిస్కోట్‌ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఆలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. సుమారు 8 నుంచి 10 కిలోల బరువున్న సాయిబాబా గొడుగుతోపాటు, దాదాపు 100 గ్రాముల బరువున్న వినాయకుడి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన ఈ రెండు వస్తువుల విలువ కలిపి రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చోరీ జరిగిన సమయంలో ఆలయ పూజారి ప్రాంగణంలోనే నిద్రిస్తున్నారు. అయినప్పటికీ దొంగలు లోపలికి చొరబడి విలువైన వస్తువులను అపహరించడంతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నెలన్నరగా పనిచేయని సీసీ కెమెరా!

ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దాదాపు నెలన్నరగా పనిచేయడం లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో దొంగల కదలికలను ఆలయంలోని కెమెరా ద్వారా గుర్తించే అవకాశం లేకుండా పోయింది. ఈ అంశం దర్యాప్తులో కీలకంగా మారింది. చోరీ విషయం వెలుగులోకి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్థానికులు అత్యవసర నంబర్‌ 112కు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

ఆలయంలోనే పనిముట్లు..

దొంగతనానికి ఉపయోగించినట్లు భావిస్తున్న ఇనుప రాడ్‌ (క్రోబార్‌), ఇతర పనిముట్లను పోలీసులు ఆలయం లోపల స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆలయంలోని హుండీని మాత్రం దుండగులు ముట్టుకోలేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఘటనపై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక బృందంతో దర్యాప్తు

చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందాన్ని కూడా రంగంలోకి దించారు. ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఇతర సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల విశ్వాసంతో ముడిపడిన ఆలయంలోనే చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. దొంగలు ఎవరన్నది, అపహరించిన వస్తువులను ఎక్కడికి తరలించారన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News