Sowjanya Anneboina August 23, 2026prabhanews.com
మంథనిలో నేడు సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం
మంథని, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో మంథనిలో సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేశారు.
మంథని మార్కెట్ యార్డులో 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వంటశాల ద్వారా పెద్దపల్లి జిల్లాలోని 15 మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాల్లో సుమారు 40,052 మంది ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఆగస్టు 24న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ఈ కేంద్రీకృత వంటశాల ప్రారంభం కానుంది.
ఆటోమేటిక్ యంత్రాలతో గంటకు 5,400 ఇడ్లీలు తయారు చేసే సామర్థ్యం ఈ వంటశాల ప్రత్యేకత. దోశ, పూరీ తయారీ యంత్రాలతో పాటు కూరగాయలను శుభ్రం చేసి కోసే యంత్రాలు, పాల శుద్ధి కేంద్రం, శుద్ధి చేసిన నీటి కేంద్రం, కేంద్రీకృత వంటగ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే అల్పాహారం, సాంబారు, కూరలను పాఠశాలలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం, హరేకృష్ణ ఫౌండేషన్, సింగరేణి సంస్థల సహకారంతో ఈ వంటశాలను నిర్మించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇప్పటికే వంటశాలను పరిశీలించి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థులు సగం కడుపుతో బడికి వెళ్లకుండా, నాణ్యమైన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా చదువుకోవాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఈ వంటశాల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
