Babu Bahadur September 24, 2026Greater Noida Bus Accident, Nine Killed Bus Fire, Uttar Pradesh Bus Fire, Yamuna Expressway Bus Fire
9-Killed-Sleeper-Bus-Fire: మంటల బస్సు ,,Andhra Prabha Crime News
- తొమ్మిది మంది సజీవదహనం
- యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోరం
- పొగతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
- బాధితుల హాహాకారాలు
- బస్సు ఆపని డ్రైవరు
(గ్రేటర్ నోయిడా, ఆంధ్రప్రభ)
అర్ధరాత్రి వేళ.. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో బస్సు ముందు భాగం నుంచి మంటలు.. క్షణాల్లో దట్టమైన పొగ.. ఏం జరుగుతుందో తెలిసేలోపే బస్సంతా అగ్నికీలల్లో చిక్కుకుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కదులుతున్న బస్సులోంచే దూకేశారు. మరికొందరు బయటపడే మార్గం లేక మంటలు, పొగ మధ్య నరకయాతన అనుభవించారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు.
ఢిల్లీ నుంచి మహోబాకు సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్లీపర్ బస్సులో రాత్రి 11.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. నోయిడా-ఆగ్రా మార్గంలో 33వ కిలోమీటరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వేగంగా బస్సు మొత్తానికి వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
బస్పు ఆపలేదు.. డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్
ఈ ప్రమాదానికి సంబంధించి ప్రయాణికుడు సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్యమే ప్రమాద తీవ్రతకు కారణమైందన్న ఆరోపణలు ఇందులో ఉన్నాయి.
బస్సు డ్రైవర్ క్యాబిన్ నుంచి కాలిన వాసన వస్తున్నట్లు ప్రయాణికులు గుర్తించి డ్రైవర్, కండక్టర్‌కు తెలియజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, బస్సులో ఇలాంటి వాసన రావడం సాధారణమేనని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు ఆరోపించారు. సమస్యను పరిశీలించేందుకు వెంటనే బస్సును ఆపలేదని, పైగా డ్రైవర్, కండక్టర్ క్యాబిన్‌లో బీడీలు, సిగరెట్లు తాగుతూనే ఉన్నారని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు
పొగ వాసన తీవ్రం కావడంతో ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సును ఆపాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ తొలుత డ్రైవర్, కండక్టర్ బస్సును ఆపేందుకు నిరాకరించారని, ప్రయాణికులను బెదిరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఆలోపే మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికుల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
'పొగతో ఏమీ కనిపించలేదు.. ఊపిరాడలేదు'
ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఢిల్లీ నుంచి మహోబాకు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తాను నిద్రలో ఉండగా ఎవరో లేపి బస్సులో మంటలు అంటుకున్నాయని చెప్పడంతో బయటకు పరుగులు తీశానని తెలిపాడు. పొగతో బస్సులో ఏమీ కనిపించలేదని, బయటకు వెళ్లేందుకు సరైన మార్గం కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వివరించాడు.
బస్సు వెనుక భాగంలో కూర్చున్న తనకు ముందు వైపు నుంచి మంటలు వ్యాపిస్తున్నట్లు కనిపించిందని చెప్పాడు. ప్రయాణికులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు తమకు తోచిన మార్గంలో బయటపడేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాడు.
మరో ప్రయాణికురాలు రింకీ రాజ్‌పుత్ తన అనుభవాన్ని వివరిస్తూ.. నోయిడా నుంచి స్వగ్రామమైన రథ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపింది. తాను నిద్రలో ఉండగా ఎవరో తలుపు తట్టి మంటల గురించి చెప్పడంతో, వస్తువులేవీ తీసుకోకుండా ఫోన్ పట్టుకుని బయటకు వచ్చానని పేర్కొంది. కనీసం చెప్పులు కూడా వేసుకునే సమయం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
బస్సులో ప్రయాణికులంతా ఒకరినొకరు తోసుకుంటూ బయటపడేందుకు ప్రయత్నించారని, ఆ గందరగోళంలో ఎవరో తనను బయటకు లాగారని రింకీ తెలిపింది. పొగతో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొందని, తన వెనుక చాలామంది ఉండిపోయారని.. వారిలో కొందరు బయటపడలేకపోయి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
బాధిత కుటుంబాలకు యోగి భరోసా
ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఆయన.. వారికి అవసరమైన అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ప్రయాణికులు ముందుగానే హెచ్చరించినా బస్సును ఎందుకు నిలిపివేయలేదు? అనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉండగా.. ఈ ప్రమాదం స్లీపర్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో బయటపడే ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
