Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
లైసెన్స్ పరిశీలించాకే నారు కొనుగోలు చేయాలి
రైతులకు ఉద్వానాధికారి వేణు సూచన
కారేపల్లి, ఆంధ్రప్రభ: నర్సరీల నిర్వహణ, నారు విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఉద్వానశాఖ అధికారులు దృష్టి సారించారు. అనుమతులు లేకుండా నర్సరీలు నిర్వహించడం, నిబంధనలు పాటించకుండా మొక్కలు, నారు విక్రయించడంపై అధికారులు పర్యవేక్షణ పెంచుతున్నారు. నర్సరీలకు సంబంధించి ఆంధ్రప్రభలో వరుసగా వెలువడిన కథనాల నేపథ్యంలో ఉద్వానశాఖ అధికారులు స్పందించి తనిఖీలు, పర్యవేక్షణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
లైసెన్స్ ఉందో లేదో చూడాల్సిందే..
రైతులు నారు, మొక్కలు కొనుగోలు చేసే ముందు సంబంధిత నర్సరీకి అధికారిక అనుమతి, లైసెన్స్ ఉందో లేదో పరిశీలించాలని వైరా డివిజన్ ఉద్వానాధికారి ఆకుల వేణు సూచించారు. నర్సరీలో మొక్కల నాణ్యత, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. నాణ్యత లేని మొక్కలు కొనుగోలు చేస్తే తర్వాత పంట దెబ్బతిని రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
లైసెన్స్ లేకుండా నర్సరీ నిర్వహించడం, అనుమతులు లేకుండా మొక్కలు బయటకు పంపించడం, నారు విక్రయాల్లో నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే నర్సరీ నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఉద్వానాధికారి వేణు హెచ్చరించారు.
రైతన్నా.. నారు కొనే ముందు ఆగు!
ప్రస్తుతం సాగు కోసం రైతులు పెద్ద మొత్తంలో నారు, మొక్కలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేవలం తక్కువ ధరకు వస్తుందనే కారణంతో నర్సరీల్లో మొక్కలు కొనుగోలు చేయకుండా, నర్సరీకి అనుమతి ఉందా.? లైసెన్స్ ఉందా.? మొక్కల నాణ్యత ఎలా ఉంది.? అనే అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.
నర్సరీ నారు విషయమై సమాచారం ఇవ్వండి
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నర్సరీలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొక్క కొనేముందు లైసెన్స్ చూడండి.. నాణ్యత పరిశీలించండి.. ఆ తర్వాతే కొనుగోలు చేయండి అని రైతులకు ఉద్వానాధికారి వేణు సూచించారు. అదేవిధంగా రైతులకు నర్సరీ నారు విషయంలో ఎలాంటి సమస్యలు గానీ అనుమానాలు వచ్చిన ఉద్వాన శాఖ కు సమాచారం అందించాలని కోరారు.
