Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Abhi Naga August 29, 2026prabhanews.com

కేసులు.. అరెస్టులు.. అన్నీ ఆదేశాల మేరకే!
జూబ్లీహిల్స్ కేసుపై సిట్ వేయాలి!
పోలీస్ పోస్టింగులపై విచారణ జరగాలి!

పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?
సుమంత్ ఎక్కడున్నాడు?
ఎఫ్‌ఐఆర్‌ల వెనుక ఎవరి ఆదేశాలు?
చిన్న పోలీసులే ఎందుకు బలవుతున్నారు?
పోస్టింగుల్లో సామాజిక న్యాయం ఎక్కడ?
పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి!
జూబ్లీహిల్స్ కేసులో అసలు బాధ్యులెవరు?
ముత్తు యాదవ్‌పైనే ఎందుకు వేటు?
ప్రవీణ్ కుమార్ సంచలన ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ప్రస్తుతం గ్యాంగ్‌వార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసుల నమోదు, అరెస్టులు, దర్యాప్తులు అన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతున్నాయంటూ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో జరిగినట్లు చెబుతున్న ఘటనతో పాటు రాష్ట్రంలోని పోలీసు పోస్టింగ్‌ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌కు సంబంధించిన కేసులో కింది స్థాయి అధికారిపై చర్యలు తీసుకున్నారని, అయితే సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితుడి ఫిర్యాదుపై ప్రశ్నల వర్షం

హరికృష్ణ అనే వ్యక్తిపై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని, గాయాలతో చికిత్స పొందిన తర్వాత కూడా వెంటనే కేసు నమోదు కాలేదని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సాధారణంగా ఎవరైనా దాడికి గురైతే బాధితుడిని ఆస్పత్రికి తరలించి, ఫిర్యాదు నమోదు చేయడం పోలీసుల విధి అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదనే అంశంపై స్పష్టత ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. దాడి సమయంలో పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికి ఎలా చేరుకున్నారనే అంశంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు? అత్యవసర నంబర్‌కు ఫోన్ వచ్చిందా? అనే విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత సాధారణ నమోదు ఎందుకు చేయలేదని, కేసు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు.

సుమంత్‌ వ్యవహారంపై విచారణ కోరిన బీఆర్‌ఎస్

మంత్రి కొండా సురేఖ కార్యాలయ ప్రత్యేకాధికారి సుమంత్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సుమంత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈ వ్యవహారంలో ఎవరినైనా రాజకీయంగా కాపాడుతున్నారా అనే అనుమానాలకు సమాధానం చెప్పాలని కోరారు.

జూబ్లీహిల్స్ ఘటనలో సీఐపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని, ఆ వ్యవహారంలో ఉన్నతాధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని పేర్కొన్నారు. కేసు నమోదు ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగిందో సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు.

'పోలీసు పోస్టింగ్‌లపై కూడా విచారణ జరగాలి'

రాష్ట్రంలో పోలీసు పోస్టింగ్‌ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించడం లేదని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కొంతమంది అధికారులకు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌లు లభిస్తుండగా, పేద కుటుంబాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పోలీసు సిబ్బందికి అనుకూలం కాని ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆరోపించారు.

పోలీసు శాఖలో పోస్టింగ్‌ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికీ ఏ ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇస్తున్నారు? రాజకీయ సిఫార్సులు లేదా ఇతర ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అంశాలపై దర్యాప్తు జరగాలని కోరారు.

కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి?

ప్రస్తుతం పోలీసు శాఖలో కింది స్థాయి అధికారులు, కానిస్టేబుళ్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ప్రవీణ్‌కుమార్ అన్నారు. పదోన్నతులు ఆలస్యం కావడం, సిబ్బందిపై పని భారం పెరగడం వంటి సమస్యలను ప్రస్తావించారు. మహిళా కానిస్టేబుళ్లకు కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు.

నిజాయితీగా పని చేసే పోలీసు అధికారులను రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారులపై అక్రమ కేసులు పెట్టడం, విధుల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

'బీఆర్‌ఎస్ 3.0లో ట్రిబ్యునల్'

భవిష్యత్తులో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థలో నమోదైనట్లు ఆరోపణలు ఉన్న అక్రమ కేసులు, పోస్టింగ్‌ల వ్యవహారంపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. నిజాయితీగా పనిచేసిన అధికారులను రక్షిస్తామని, రాజకీయ ఒత్తిళ్లతో వ్యవహరించిన అంశాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News