Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆర్మీ సైనికుడిపై దాడి.. 14 మంది అరెస్ట్‌

Nagamani Malligari October 24, 2026prabhanews.com

14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్‌ కడియం స్వాధీనం

పరారీలో మరికొందరు నిందితులు..

యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి

మెట్‌పల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, దాడికి ఉపయోగించినట్లు పేర్కొన్న స్టీల్‌ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మెట్‌పల్లి సీఐ బి. సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 22 రాత్రి వెల్లుల్ల గ్రామానికి చెందిన వన్నెల వికాస్‌పై బండలింగాపూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా వికాస్‌ తన స్నేహితులు సుమారు 30 మందితో కలిసి ద్విచక్ర వాహనాలపై అర్ధరాత్రి దాటిన తర్వాత వెల్లుల్ల నుంచి బండలింగాపూర్‌కు వెళ్లారు.

అక్టోబర్‌ 23 తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో గ్రామంలోని హనుమాన్‌ ఆలయం సమీపంలో బతుకమ్మ ఆడుతున్న వారి పక్క నుంచి యువకులు ద్విచక్ర వాహనాలపై వేగంగా, నిర్లక్ష్యంగా వెళ్లడంతో అక్కడే ఉన్న ఆర్మీ సైనికుడు తిగుర్ల స్వామి వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోగా, కొందరు యువకులు ఆయనపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్టీల్‌ చేతి కడియంతో ముఖంపై కొట్టడంతో స్వామికి తీవ్ర రక్తగాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా అక్టోబర్‌ 24 ఉదయం మేడిపల్లి గ్రామ శివారులోని ఇబ్రహీంపట్నం ఎక్స్‌రోడ్డు వద్ద వెల్లుల్ల గ్రామానికి చెందిన 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్‌ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. ఘటనతో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి

యువకులు గుంపులుగా ఏర్పడి అర్ధరాత్రి వేళల్లో గొడవలు, దాడులకు పాల్పడితే వారి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని మెట్‌పల్లి సీఐ బి. సురేష్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ జి. నవీన్‌కుమార్‌ హెచ్చరించారు. తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలతో పాటు భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ వంటి ప్రక్రియలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News