Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

Sowjanya Anneboina October 3, 2026prabhanews.com

  • నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.. అధికారులకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

శనివారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు, రాఘవపూర్‌లో ఇందిరా మహిళా శక్తి భవనం, పెద్దపల్లి బస్‌ డిపో, కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

అప్పన్నపేటలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.

రాఘవపూర్‌లో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భవనానికి వెళ్లే అప్రోచ్‌ రోడ్డుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

బస్‌ డిపోలో మౌలిక వసతులు కల్పించాలి

పెద్దపల్లి బస్‌ డిపో నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌.. ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పెండింగ్‌ పనులను వేగవంతం చేసి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ఫ్లైఓవర్‌ పనుల్లో జాప్యం వద్దు

కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యుత్‌ వైరింగ్‌, స్తంభాల మార్పిడి పనులను త్వరగా పూర్తిచేసి తదుపరి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.

జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేసి, ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో పెద్దపల్లి ఆర్డీఓ బి. గంగయ్య, డీఈ రమణారెడ్డి, ఏఈ రాజ్‌కుమార్‌, ఈఈ పీఆర్‌ శంకరయ్య, గోదావరిఖని డిపో మేనేజర్‌ కవిత, రైల్వే జేఈ జానకిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్‌, తహసీల్దార్‌ రాజయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News