Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ !?

Pavan Chandragiri September 1, 2026

  • టీమిండియాలోకి క్రునాల్ పాండ్యా..
  • అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు పరిశీలన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కృణాల్ పాండ్యా టీమిండియా కమ్‌బ్యాక్‌పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.

ఐదేళ్ల తర్వాత మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన కృణాల్‌పై సెలెక్టర్లు మరోసారి కన్నేశారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2026 ఐపీఎల్‌లో అదరగొట్టిన క్రునాల్.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో కీలక సందర్భాల్లో జట్టును ఆదుకున్నాడు. దీంతో సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు అతడి పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా క్రునాల్‌ను తీసుకునే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజంగానే ఐదేళ్ల తర్వాత క్రునాల్ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపిస్తాడా అన్నదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ఐపీఎల్‌లో 2026 సీజన్ లో ఆర్సీబీ (RCB) తరపున కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. 14 వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి అనేక సందర్భాల్లో జట్టును ఆదుకున్నాడు. ఆ సీజన్ లో మొత్తం 226 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శన కూడా కీలకంగా నిలిచింది. 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో కలిపి క్రునాల్ 31 వికెట్లు సాధించడం కూడా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన అంశంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒత్తిడిలో బౌలింగ్ చేయగల సామర్థ్యం, బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్‌కు ఉపయోగపడటం అతడికి అదనపు బలం.

అక్షర్‌కు ప్రత్యామ్నాయంగా?

ప్రస్తుతం టీమిండియాలో ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అయితే ఇటీవలి టీ20 మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అక్షర్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా క్రునాల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే క్రునాల్‌ను అక్షర్ స్థానంలో తప్పనిసరిగా ఎంపిక చేస్తారని ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇది సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్న అవకాశాల్లో ఒకటిగానే కనిపిస్తోంది.

2021లో చివరిసారి టీమిండియాకు..

క్రునాల్ పాండ్యా చివరిసారిగా 2021లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శ్రీలంక పర్యటనలో ఆడిన తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ పర్యటనలోనే వన్డే ఫార్మాట్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనే తన ప్రదర్శనతో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న క్రునాల్‌కు తిరిగి టీమిండియాలో చోటు దక్కడం ఆసక్తికర పరిణామమే. అయితే సెలెక్టర్లు వయసు కంటే ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలు, అనుభవం వంటి అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 2026 ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఇందుకు బలమైన కారణంగా మారింది.

అంతేకాకుండా అఫ్గానిస్థాన్‌తో పాటు ఈ ఏడాది భారత జట్టుకు మరికొన్ని టీ20 సిరీస్‌లు ఉన్నాయి. అందువల్ల ఒక్క సిరీస్‌కు మాత్రమే క్రునాల్‌ను పరిశీలిస్తున్నారా? లేక రాబోయే టీ20 ప్రణాళికలో భాగంగా అతడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

భారత సెలెక్టర్లు క్రునాల్ పేరును పరిశీలిస్తున్నారన్న వార్తలు వెలువడినప్పటికీ.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు తుది జట్టులో అతడి పేరు ఉంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. బీసీసీఐ అధికారికంగా జట్టును ప్రకటించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న క్రునాల్ పాండ్యాకు మరోసారి టీమిండియా తలుపులు తెరుచుకుంటాయా? అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News