Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
- అంకంపాలెం బీట్‌లో రూ.7.05 లక్షల విలువైన 5.235 క్యూబిక్ మీటర్ల టేకు కలప స్వాధీనం
దమ్మపేట-2, ఆంధ్రప్రభ : విలువైన టేకు చెట్లను అనుమతులు లేకుండా నరికివేయడం, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా కలపను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి అక్రమాలకు అటవీ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.
అటవీ సంపద పరిరక్షణలో భాగంగా జిల్లాలో అక్రమ కలప నరికివేత, నిల్వ, రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్ సమాచారంతో వేగవంతమైన చర్య అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద రక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో భాగంగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకంగా పనిచేస్తోంది.
ఈ కేంద్రం 24/7 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సిబ్బందితో నిరంతరం పనిచేస్తోంది. అంకంపాలెం బీట్‌లో అనుమతులు లేకుండా టేకు కలపను అక్రమంగా నిల్వ చేసినట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా సంబంధిత టాస్క్‌ఫోర్స్ బృందానికి వెంటనే సమాచారం చేరవేశారు.
సమాచారం అందిన వెంటనే టాస్క్‌ఫోర్స్ ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట రేంజ్ అధికారులు, బీట్, సెక్షన్ అధికారులు సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందిన 24 గంటల్లోనే టాస్క్‌ఫోర్స్ బృందం అక్రమ కలప నిల్వను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, అటవీ నేరాల నియంత్రణలో వేగవంతమైన సమాచార వ్యవస్థ, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయానికి నిదర్శనంగా నిలిచింది.
అంకంపాలెం బీట్‌లో భారీగా టేకు కలప పట్టివేత
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అంకంపాలెం బీట్‌లో తనిఖీలు నిర్వహించి, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను గుర్తించి స్వాధీనం చేసుకుంది. అధికారులు నిర్వహించిన కొలతల్లో 57 టేకు రౌండ్ దుంగలు - 2.775 క్యూబిక్ మీటర్లు, 44 టేకు సాన్ సైజులు - 2.460 క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తంగా 5.235 క్యూబిక్ మీటర్ల టేకు కలప, సుమారు రూ.7.05 లక్షల విలువైన అటవీ సంపదను స్వాధీనం చేసుకున్నారు.
రైతు వద్ద కొనుగోలు చేశాను" అనడం మాత్రమే చట్టబద్ధతను కల్పించదు
కలపను నిల్వ ఉంచిన వ్యక్తిని అధికారులు విచారించగా, తాను ఈ టేకు కలపను ఒక రైతు వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే సంబంధిత చెట్లను నరికివేయడానికి అవసరమైన అనుమతులు, చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా నరికిన చెట్ల నుంచి వచ్చిన కలపను కొనుగోలు చేసినా, నిల్వ ఉంచినా అది చట్టబద్ధమైన కలపగా మారదని అధికారులు స్పష్టం చేశారు.
అటవీ శాఖ అనుమతులు, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం లేదా రవాణా చేయడం వర్తించే అటవీ చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలకు దారితీస్తుందని తెలిపారు. కలప కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ దాని మూలం, అనుమతులు, రవాణా పత్రాలు, చట్టబద్ధతను తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.
అటవీ సంపద రక్షణకు నిరంతర నిఘా
అక్రమంగా చెట్లను నరికివేయడం వల్ల కేవలం కలప సంపద మాత్రమే కాకుండా, జీవవైవిధ్యం, వన్యప్రాణుల ఆవాసాలు, నేల సంరక్షణ, నీటి వనరులు, పర్యావరణ సమతుల్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు. అటవీ సంపదను కాపాడటం అటవీ శాఖతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ కలప నరికివేత, నిల్వ లేదా రవాణా గురించి సమాచారం తెలిసిన వారు అటవీశాఖకు తెలియజేసి అటవీ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం టేకు కలపను దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సమక్షంలో అంకంపాలెం బీట్ అధికారి శ్రీమతి ఏ. పార్వతి సురక్షిత కస్టడీకి అప్పగించారు. ఘటనపై వర్తించే అటవీ చట్టాలు, నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.జిల్లాలో అటవీ సంపదకు నష్టం కలిగించే అక్రమ నరికివేత ,కలప నిల్వ , అక్రమ రవాణాపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24/7 నిఘా కొనసాగుతుందని ,సమాచారం అందిన వెంటనే టాస్క్ ఫోర్స్ , రేంజ్ అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు .
తనిఖీల్లో పాల్గొన్న అధికారులు
ఈ చర్యల్లో టాస్క్‌ఫోర్స్ బృందం ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస్ , సెక్షన్ అధికారులు లోకనాదం , ప్రసాద లింగం , బీట్ అధికారి రాములు , దమ్మపేట ఎఫ్ ఆర్ ఓ శ్రీను , బీట్ అధికారులు పార్వతి, కాంతారావు, రాజారమేష్ ,ఇతర అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
