Rama Rao September 2, 2026Rendlaguda, Telangana
మిషన్ కాకతీయ నిధులపై ఆరోపణలు.. రూ.29.20 లక్షలు ఖర్చు
పనులు తూతూమంత్రంగా చేసి నిధులు దుర్వినియోగం చేశారంటున్న రైతులు
జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామ రెవెన్యూ శివారులోని అల్లం వారి కుంటలో మిషన్ కాకతీయ రెండో దశ కింద చేపట్టిన పనులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్లు 160, 161లో సుమారు 24 ఎకరాల్లో ఉన్న ఈ కుంట అభివృద్ధికి రూ.43.10 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించగా, రూ.29.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు నీటిపారుదల శాఖ రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. టెండర్ అనంతరం పనులు రేండ్లగూడకు చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించగా, పిచ్చి మొక్కల తొలగింపు, తూములు, కాలువలకు సిమెంట్ పనులు, మట్టి తొలగింపు తదితర పనులు చేపట్టినట్లు రికార్డుల్లో నమోదైంది. పనులు 2016 ఏప్రిల్ 18న ప్రారంభించి 2017 జూన్ 16న పూర్తి చేసినట్లు అగ్రిమెంట్, మెజర్‌మెంట్ బుక్ వివరాలు పేర్కొంటున్నాయి. అయితే పనులు నాణ్యత లేకుండా తూతూమంత్రంగా చేపట్టి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు కుంట భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తూ పలువురు రైతులు, ప్రజా సంఘాల నాయకులు గతంలో ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై స్వచ్ఛంద సేవకుడు, రైతు సముద్రాల శంకర్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, తహసీల్దార్, నీటిపారుదల శాఖ, ఎంపీడీవో కార్యాలయాల ముట్టడి, ధర్నాలు నిర్వహించారు. ఇటీవల అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు కుంట వద్ద సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ నిధులతో చేపట్టిన పనులు, ఖర్చులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిధుల దుర్వినియోగం జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
